కాలేజీలకు ఊరట..!

కాలేజీలకు ఊరట..! - Sakshi


‘ఈ–పాస్‌’లో కన్ఫర్మేషన్‌ కాకున్నా కాలేజీ వివరాలు అప్‌డేట్‌

విద్యార్థుల ఉపకార దరఖాస్తుకు తొలగిన ఇబ్బందులు




సాక్షి, హైదరాబాద్‌: కళాశాలలకు ఊరట లభించింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రభుత్వం నిబంధ నలు సడలించింది. ఇప్పటివరకు సంబంధిత వర్సిటీ/ బోర్డు నుంచి గుర్తింపును రెన్యూవల్‌ చేసుకున్న కాలేజీల వివరాలే ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసేవారు. అలా అప్‌డేట్‌ అయిన కాలేజీల విద్యార్థులు మాత్రమే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుండేది.



రెన్యూవల్‌ చేసుకోని విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల గుర్తింపు రెన్యూవల్‌ నిబంధనకు తాత్కాలికంగా బ్రేకు వేసింది. గుర్తింపు పత్రాలు సమర్పించని కాలేజీలకూ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని కాలేజీల వివరాలనూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాల్సిందిగా సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)కు సూచించింది.



ప్రక్రియ వేగవంతం చేసేందుకు...

ప్రతి ఏడాది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. కాలేజీలు గుర్తింపు పత్రాలు సమర్పిం చడంలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇలా ఒకటికి రెండు సార్లు దర ఖాస్తుల గడువు పెంచాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుం డటంతో అర్హుల నిర్ధారణ... నిధుల పంపిణీ సైతం ఆలస్యమవుతోంది.



ఈ క్రమంలో విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ వేగవంతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా కాలేజీల కన్ఫర్మేషన్‌ నిబంధనను సడలిం చింది. ఇప్పటివరకు 5.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్‌ 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుండగా... ఆ లోపు పూర్తి స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గడువును పొడిగించే ప్రసక్తే లేదని సంక్షేమా ధికారులు స్పష్టం చేశారు.



కన్ఫర్మ్‌ ఆయ్యాకే పథకాల వర్తింపు...

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలని భావించిన ప్రభుత్వం... తాజాగా కాలేజీల కన్ఫర్మేష న్‌కు విరామం ఇచ్చింది.  దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక, ఉపకారవేతనాలు, ఫీజుల పంపిణీ ప్రక్రియలో మాత్రం కాలేజీల కన్ఫర్మేషన్‌ తప్పనిసరిగా ఉండాలని సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. నవంబర్‌లో దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గడువులోగా సంబంధిత యూనివర్సిటీ/ బోర్డుల నుంచి గుర్తింపు పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. లేకుంటే ఆయా కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనను నిలిపివేయనున్నట్లు తేల్చి చెప్పింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top