గురుకుల టీచర్ల భర్తీకి రెండంచెల పరీక్ష

గురుకుల టీచర్ల భర్తీకి రెండంచెల పరీక్ష


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టుల భర్తీలో అమలు చేయాల్సిన పరీక్షల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ మొదటిసారిగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపడుతుండడంలో కొత్త విధానాన్ని రూపొందించింది. రెండంచెల విధానంలో (ప్రిలిమినరీ, మెయిన్) ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. అన్ని పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో ఆబ్జెక్టివ్ విధానాన్ని అనుసరించాలని పేర్కొంది.



ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు రెండంచెల్లో పరీక్షలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. మొదటి పరీక్షకు ప్రిలిమినరీ అనే పేరు మాత్రం పెట్టలేదు. అదే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు మాత్రం ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష, మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం జీవో 229 జారీ చేశారు. ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీలో 30 మార్కులతో ఇంటర్వ్యూ/డెమాన్‌స్ట్రేషన్/ముఖాముఖి ఉం టుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పోస్టు ల భర్తీకి డిస్క్రిప్టివ్ విధానం అమల్లోకి తెచ్చే ఆలోచనలు జరిగినా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది.

 

 ఇదీ పేపర్ల విధానం

 టీచర్ పోస్టులకు..

►మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది.

 పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు.



► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్‌గా 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

 పేపరు-1: ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. పెడగాజీ/స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు.

 పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో నిర్వహిస్తారు. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు.



 ప్రిన్సిపల్ పోస్టులకు..

► మొదటి పరీక్షలో ఒక పేపరు ఉంటుంది.

 పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు.



► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్‌గా నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి.

 పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.  150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు.

 పేపరు-2: రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్‌మెంట్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు. అదనంగా 30 మార్కులకు ఇంటర్వ్యూ/డెమాన్‌స్ట్రేషన్/ముఖాముఖి ఉంటుంది.



 జూనియర్ లెక్చరర్ పోస్టులకు..

►ప్రిలిమినరీ పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది.

 పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు.



►రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్‌గా నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి.

 పేపరు-1: పెడగాజీ, స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.  100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు.

 పేపరు-2: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 200 మార్కులకు 200 ప్రశ్నలతో నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్‌స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది.



 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులకు

► ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పేరుతో మొదటి పరీక్ష ఉంటుంది.

 పేపరు-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫీషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు.



► రెండో పరీక్షను మెయిన్ ఎగ్జామినేషన్‌గా నిర్వహిస్తారు. ఒక పేపరు ఉంటుంది.

 పేపరు-1: సంబంధిత సబ్జెక్టులో ఉంటుంది. 300 మార్కులకు నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఉంటుంది. అదనంగా ఇంటర్వ్యూ/డెమాన్‌స్ట్రేషన్/ముఖాముఖి 30 మార్కులకు ఉంటుంది.



 ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్లకు

 పేపరు-1గా ఒక పేపరు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులో జ్ఞానంపై 200 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top