'డ్రంక్ అండ్ డ్రైవ్' తప్పించుకున్నారు.. కానీ

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో విషాదం - Sakshi


హైదరాబాద్‌: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పోలీసుల తనిఖీలు తప్పించుకునే క్రమంలో మృతిచెందారు. ఈ ప్రమాదం నగరంలోని లంగర్‌హౌజ్‌ సమీపంలోని బాపూఘాట్‌ వద్ద ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా బుద్వేలుకు చెందిన శ్రీనివాస్‌, రాజేశ్‌ మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్ బాపూఘాట్‌ వద్దకు వచ్చారు. అక్కడ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారని గమనించిన యువకులు వీరి నుంచి తప్పించుకునే క్రమంలో రాంగ్‌ రూట్‌లో వేగంగా బైక్‌పై దూసుకెళ్లారు



వీరు వెళ్లేది రాంగ్ రూట్ కావడం, అందులోనూ బైక్‌పై వేగంతో వెళ్తుండటంతో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాజేశ్‌ అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రీనివాస్ మృతిచెందినట్లు సమాచారం. బైక్‌ను ఢీకొట్టిన క్రమంలో లారీ డ్రైవర్.. మరో కారు, ట్రాఫిక్ పోలీసుల క్రేన్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్, రాజేశ్ వెళ్తున్న బైక్ ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. లారీ డ్రైవర్ కూడా మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని గుర్తించారు. లారీని సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top