రెండా.. నాలుగా?

రెండా.. నాలుగా? - Sakshi


- రెండు కొత్త జిల్లాలతో సరిపెట్టిన అధికారులు

- ప్రతిపాదనలపై టీఆర్‌ఎస్ సహా పలు పార్టీల గుర్రు

- ఎటూ తేల్చని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు  

- సీఎంకే వదిలేయాలని నిర్ణయం

- నాలుగు జిల్లాల ఏర్పాటు.. అందరికీ ఆమోదయోగ్యం  

- నియోజకవర్గాలు, జనాభాపరంగా సమగ్రరూపం

 

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. అధికారులు రూపొందించిన జాబితాలతో ప్రజాప్రతినిధులతోపాటు రాజకీయ పార్టీలు విభేదిస్తున్నాయి. దీంతో జంట జిల్లాల విభజన అంశం అంత సులువుగా తేలే పరిస్థితి కనిపించటం లేదు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకున్నా.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని శివార్లను కలుపుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎంఐఎంతో పాటు అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా అంత సానుకూలంగా లేకపోవటంతో రెండు జిల్లాల కలెక్టర్లు సైతం ఎటూ తేల్చుకోలేక సీఎం నిర్ణయానికే వదిలేశారు.    

                 -సాక్షి, హైదరాబాద్

 

 ప్రతిపాదనలపై నేతల గుర్రు

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు రూపొందించిన ప్రాథమిక జాబితాలో హైదరాబాద్ జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను హైదరాబాద్‌లో చేర్చారు. ఈ ప్రతిపాదనలపై ఎంఐఎంతోపాటు రంగారెడ్డి జిల్లా నేతలందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి మార్పులు చేయొద్దని ఎంఐఎం ముఖ్య నేతలు జిల్లా అధికారులకు సూచించగా.. రంగారెడ్డి జిల్లా నేతలు సైతం తమను హైదరాబాద్ జిల్లాలో కలిపే బదులు ప్రత్యేక జిల్లాలుగా విభజించాలని కోరుతున్నారు.



 అధికారుల ప్రతిపాదనలు ఇలా..

 ప్రతి జిల్లాలో ఆరు నుంచి ఏడు నియోజకవర్గాలు, 18 నుంచి 20 లక్షల జనాభా వరకు ఉండొచ్చని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలో భారీ నియోజకవర్గాలను చేరుస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. హైదరాబాద్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట,యాకుత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట, గోషామహల్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ జిల్లాలో ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే హైదరాబాద్ జిల్లాలో భువనగిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలు వస్తుండగా... సికింద్రాబాద్ జిల్లాలో కూడా చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లోని ప్రాంతాలున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానం యూనిట్‌గా జిల్లాలు ఏర్పడగా.. అందుకు విరుద్ధంగా ప్రస్తుత ప్రతిపాదనలు సిద్ధం కావటంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.



 నాలుగింటితో.. అందరికీ మోదం

 హైదరాబాద్, సికింద్రాబాద్‌జిల్లాలతోపాటు హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ జిల్లాల ఏర్పాటు అంశాన్ని పలువురు ముందుకు తెస్తున్నారు. ఈ ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, ఎవరి గుర్తింపు, ప్రత్యేకతకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.



 హైదరాబాద్ జిల్లాలో... హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, గోషామహల్‌తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నాంపల్లి నియోజకవర్గం అదనంగా వస్తుంది. భౌగోళికంగా సమగ్రంగా ఉంటుంది.









Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top