రెండు మాడ్యూల్స్.. ఒకే టార్గెట్

రెండు మాడ్యూల్స్.. ఒకే టార్గెట్ - Sakshi


- పాతబస్తీకి చెందిన వారితో జేకేబీహెచ్ మాడ్యూల్ ఏర్పాటు   

- మహారాష్ట్రలోని పర్భనీలో మరో గ్యాంగ్ కూడా సిద్ధం

 

 సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) మీడియా వింగ్ చీఫ్‌గా ఉన్న కర్ణాటకలోని భత్కల్ వాసి షఫీ ఆర్మర్ హైదరాబాద్‌లో విధ్వంసానికి రెండు మాడ్యూల్స్ ఏర్పాటు చేశాడా..? ఈ రెండు మాడ్యూల్స్‌కూ ఒకే తరహా టార్గెట్లు ఇచ్చాడా..? వీటికి ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. అన్సార్ ఉల్ తౌహీద్(ఏయూటీ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడుతుపుతున్న షఫీ ఆర్మర్ నగరంలో విధ్వంసంతో పాటు మత ఘర్షణలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి.



హ్యాండ్లర్‌గా ఉన్న ఇతగాడు ఒకవైపు పాతబస్తీకి చెందిన ఇబ్రహీం యజ్దానీ నేతృత్వంలో ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్)’ మాడ్యూల్‌నే కాక.. మరోవైపు మహారాష్ట్రలోని పర్భనీ కేంద్రంగా నాసిర్ నేతృత్వంలో మరో ముఠాను కూడా సిద్ధం చేశాడు. ఈ రెండు మాడ్యూల్స్ టార్గెట్ హైదరాబాదే. తొలుత ఇబ్రహీం యజ్దానీ నేతృత్వంలో మాడ్యూల్ ఏర్పాటు చేయించిన ఆర్మర్.. ఇలియాస్, ఫహద్, రిజ్వాన్, హబీబ్, అథవుల్లా, యాసిర్‌లతో కూడిన ఈ గ్యాంగ్‌కు రంజాన్ సందర్భంగా విధ్వంసాలు సృష్టించాల్సిందిగా ఆదేశించాడు. అయితే పేలుడు పదార్థాల సమీకరణ పూర్తి చేసిన ఈ మాడ్యూల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు ‘ఆపరేషన్’కు రెండు రోజుల ముందు అరెస్టు చేశారు. ఒకవైపు ఈ మాడ్యూల్‌ను తయారు చేసిన హ్యాండ్లర్ ఆపరేషన్‌కు ‘ఎలాంటి ఆటంకాలు’ రాకూడదనే ఉద్దేశంతో పర్భనీ మాడ్యూల్‌ను కూడా రెడీ చేశాడు.



 కేజీ బాంబు సిద్ధం చేసినా ధైర్యం చాలక..

 ఔరంగాబాద్ యాంటీ టైస్ట్ స్కా ్వడ్(ఏటీఎస్) అధికారులు పర్భనీలో ఈ నెల 14న నాసిర్ అలియాస్ ఖదీర్ అబు బకర్ యాఫై చావుస్‌ను, శనివారం రాత్రి మహ్మద్ షహీద్ ఖాన్‌ను పట్టుకున్నారు. వీరు కూడా ఆర్మర్ ఆదేశాల మేరకు ‘ఉగ్ర’ చర్యలకు సన్నద్ధమయ్యారని ఏటీఎస్ విచారణలో వెల్లడైంది. ఆర్మర్ ఆదేశాల మేరకు కొన్ని బాంబుల్ని తయారు చేసి వాటి ఫొటోలు సోషల్‌మీడియా ద్వారా అతడికి పంపినట్లు తేలింది. బాంబుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను నాగ్‌పూర్, పుణేతో పాటు హైదరాబాద్ నుంచి అందాయని నాసిర్  విచారణలో వెల్లడించాడు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్, ఔరంగాబాద్, నాందేడ్‌ల్లో ఒకచోట విధ్వంసం సృష్టించాలని ఆర్మర్ ఆదేశించడంతో కేజీ బరువున్న బాంబును సిద్ధం చేశారు. అయితే విధ్వంసం సృష్టించడానికి ధైర్యం చాలకపోవడంతో ఆ బాంబును ఖాన్ సమీప బంధువు ఇంట్లో దాచి ఉంచారు. ఏటీఎస్ అధికారులు ఆదివారం ఆ బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.

 

 ఆ ఉగ్ర ఫైనాన్షియర్ అద్నాన్ హసన్

 సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ‘ఐసిస్ త్రయానికి’ ఆర్థిక సాయం చేసింది అద్నాన్ హసన్‌గా ఎన్‌ఐఏ నిర్థారించింది. ఢిల్లీలోని పటియాల కోర్టులో సోమవారం దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. 2014లో బెంగాల్ మీదుగా సరిహద్దులు దాటి సిరియా వెళ్లేందుకు యత్నించిన అబ్దుల్ బాసిత్, హసన్ ఫారూఖ్‌ను నగర పోలీసులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి సిరియా వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్న అబ్దుల్ బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్ నాగ్‌పూర్‌లో చిక్కారు. ఈ రెండుసార్లూ వీరికి అవసరమైన నిధుల్ని దుబాయ్ నుంచి అద్నాన్ హసన్ పంపినట్లు తేలింది. గత ఏడాది ఇతడితో పాటు షేక్ అజర్, ఫరాన్ షేక్‌లను డిపోర్టేషన్‌పై తీసుకువచ్చి ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ అరెస్టు చేసింది.

 

 ఆ ఏడుగురి రిమాండ్ పొడిగింపు

 ఎన్‌ఐఏ అధికారులు గత నెల్లో అరెస్టు చేసిన జేకేబీహెచ్ ఉగ్రవాదుల జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్, ఫహద్, రిజ్వాన్, హబీబ్, అథవుల్లా, యాసిర్‌లను నాంపల్లి కోర్టు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. వీరి రిమాండ్ కాలం ముగియడంతో మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top