ఎన్నికల నిర్వహణకు ఏడు హెలికాప్టర్లు

ఎన్నికల నిర్వహణకు ఏడు హెలికాప్టర్లు

  •  సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి ప్రభుత్వ బంగళాల్లో పార్టీ

  •  కార్యకలాపాలు నిర్వహించరాదు

  •  పొన్నాలపై విచారణ జరిపి చర్యలు

  •  గుర్తుతో ఫొటో ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తే చర్యలు

  •  పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసులు - ఒక హోంగార్డు

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దశల్లో జరిగే పోలింగ్‌నకు ఏడు హెలికాప్టర్లతో పాటు రెండు ఎయిర్ అంబులెన్స్‌లను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ప్రభుత్వ బంగళాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదని, నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రులను ఆయన హెచ్చరిం చారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ బంగళాలో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అలాగే పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ గుర్తులు లేకుండా తెల్ల పేపర్ స్లిప్‌లను మాత్రమే ఓటర్లకు పంపిణీ చేయాలని, అలా కాకుండా అభ్యర్థుల పేర్లు, గుర్తులతో స్లిప్‌లు పంపిణీ చేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై భన్వర్‌లాల్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

     

    ఆయన చెప్పిన వివరాలు..


    ఈ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు చేయాల్సిందిగా కమిషన్ లక్ష్యంగా పెట్టింది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అధికారులు వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా ప్రోత్సహించేందుకు ఎవరికి తగిన విధానాలు వారు అవలంబించడం సంతోషమే. ఎంత ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతోనే అధికారులు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

     రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ నిర్వహణకు 400 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు 2.50 లక్షల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసులతో పాటు ఒక హోంగార్డు ఉంటారు.తెలంగాణ జిల్లాల్లో 30వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలి. 28వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా ఓటరు కాని వారందరూ ఆయా నియోజకవర్గాలను వీడి వెళ్లిపోవాలి. పోలింగ్ రోజు వంద మీటర్ల లోపల ఓటు ఎవరికి వేయాలనే దానిపై ప్రచారం నిర్వహించరాదు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు నిషేధం.



    రాష్ట్రంలో 71,222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 45 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్ల ద్వారా బూత్ లోపలి దృశ్యాలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వీక్షించవచ్చు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరిస్తారు.ఓటర్‌స్లిప్‌ల పంపిణీ తెలంగాణలో 26, సీమాంధ్రలో 30వ తేదీకి పూర్తి అవుతుంది. స్లిప్‌లు సక్రమంగా పంపిణీ చేయని వారిపై చర్యలు తీసుకుంటాం. 55 శాతం పంపిణీ పూర్తి అయింది.

     

    ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు పెద్దగా రాలేదు. ఆ నియమావళి పాటిం చడం సంతృప్తికరంగా ఉంది. ఇప్పటి వరకు 111 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. 13,973 మందిని అరెస్టు చేశాం, 4.25 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న కరీంనగర్ పోలీసు అధికారి బి.రాజును సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉండాలి. ఏదైనా పార్టీ, అభ్యర్థి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఓటర్లందరూ డబ్బు, మద్యం, కులం, మతాలకు అతీతంగా మంచి వ్యక్తికి ఓటు వేయాలి. అందరూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి.నక్సలైట్లు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుందని గతంలో ప్రకటించాం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు వరకూ పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. ఆ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతాం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top