సరికారు మాకెవ్వరూ!

సరికారు మాకెవ్వరూ!


తెరాసలో  విజయోత్సాహం

‘గ్రేటర్’ ఎన్నికలకూ ఓరుగల్లు మంత్రం

ఒంటరి పోరుకు గులాబీ శ్రే ణులు సన్నద్ధం


 

సిటీబ్యూరో: వరంగల్ ఉప ఎన్నికల ఫలితం నగర తెరాస శ్రేణుల్లో కొత్త జోష్‌ను తెచ్చిపెట్టింది. సరి‘కారు’ మాకెవ్వరూ అంటూ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే ఊపుతో జనవరిలో నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగానే సత్తా చాటేందుకు వీలుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికార టీఆర్‌ఎస్ సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భేష్ అంటూ వరంగల్ ఓటర్లు తీర్పునిచ్చిన నేపథ్యంలో... కాస్త అటూ ఇటూగా అదే నినాదంతో టీఆర్‌ఎస్ ఎన్నికలకు వెళ్లనుంది. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు స్థానాలకే పరిమితమవడం... గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమి పాలవటంతో నగరంలోని పార్టీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డారు. అనంతరం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి రావడంతో మళ్లీ వీరిలో ఉత్సాహం తొణికిసలాడుతోంది.



మరోవైపు నగరంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేసి... సానుకూల ఫలితాన్ని రాబట్టే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మంత్రులు తలసాని, పద్మారావు, నాయిని, మహమూద్ అలీతో పాటు కేటీఆర్, హరీష్, మహేందర్‌రెడ్డి నగరంలో మరింతగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను పరుగెత్తించే బాధ్యతలు తీసుకోనున్నారు. డివిజన్ల వారీగా పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలను క్షేత్ర స్థాయిలో అంచనా వేయనున్నారు.



 నగర వాసులపై  వరాల వర్షం

 గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నగర వాసులపై ప్రభుత్వం మరింతగా వరాల వర్షం కురిపించనుంది.  ‘స్వచ్ఛ హైదరాబాద్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇప్పటికే 20 లక్షల ఇళ్లకు రెండేసి            చెత్త డబ్బాలు పంపిణీ చేయడంతో పాటు... నగర రహదారులను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే       ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా నగరంలో 1000 కి.మీ. రహదారులు, 400 కి.మీ. మేర వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. ఇవి కాకుండా మహిళా స్వయం సంఘాలకు రూ.1000 కోట్ల రుణాలు... నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్‌రూం ఇళ్లు... మరో 50 ప్రాంతాల్లో రూ.5కే భోజనం... జీఓ 58 కింద సుమారు లక్ష మందికి ఉచిత భూ క్రమబద్ధీకరణ వంటి అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. అదే విధంగా డిసెంబర్ 15 నుంచి నగరానికి  గోదావరి జలాల రాకతో పాటు మురికివాడల్లో రూ.100కే మంచినీరు, రూ.100కే విద్యుత్ సరఫరా అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top