ఫిరాయింపులపై ‘చీలిక’ ముద్ర!

ఫిరాయింపులపై ‘చీలిక’ ముద్ర! - Sakshi


టీడీపీ ఎమ్మెల్యేలను అధికారికంగా విలీనం చేసుకునే వ్యూహంలో టీఆర్‌ఎస్

చట్టసభలో మూడింట రెండువంతుల మంది పార్టీ మారితే అనర్హత అవకాశం లేనట్లే

వారంతా ‘మారిన’ పార్టీలో అధికారిక సభ్యులే

గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 15 ఎమ్మెల్యే స్థానాలు

అందులో ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన ఏడుగురు

మరో ముగ్గురు చేరితే మూడింట రెండొంతుల మెజారిటీ

వారంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్న ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు

చివరలో రానున్న ఓ సీనియర్ ఎమ్మెల్యే... ఆ వెంటనే చీలిక

తమదే మెజారిటీ వర్గమంటూ టీఆర్‌ఎస్‌లో విలీనానికి తీర్మానం

తరువాత తలసాని సహా అంతా అధికార పార్టీ సభ్యులే


 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ ఫిరాయింపుల వివాదానికి ముగింపు పలికే కార్యాచరణకు టీఆర్‌ఎస్ శ్రీకారం చుట్టింది. పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను అధికారికంగా టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు అవసరమైన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను త్వరలోనే పార్టీలో చేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరులోగానే ఆ కసరత్తును పూర్తి చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం... ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన మొత్తం చట్టసభ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది వేరే పార్టీలో చేరితే... వారిని అధికారికంగా ఆ పార్టీ సభ్యులుగా గుర్తించాల్సి ఉంటుంది. శాసనమండలిలో టీడీపీ సభ్యులు గతంలో ఇదే రీతిలో అధికార టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యా రు.

 

 తాజాగా అదే వ్యూహాన్ని శాసనసభలోనూ అమలు చేసేందుకు టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీని వాస్‌యాదవ్.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి చేపట్టారు. శాసన సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో అధికారికంగా విలీనమైతే... ఆయన తన రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకుంటారు. దాంతో ఫిరాయింపుల వివాదానికి ఒక రకంగా ఫుల్‌స్టాప్ పడనుంది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంతకుముందే పూర్తికావాల్సి ఉన్నా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా జాప్యం జరిగినట్లు అత్యున్నత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

 

 అంతిమ కార్యాచరణకు మరో ముగ్గురు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అనర్హతకు గురికాకుండా, అధికారికంగా మరో పార్టీలో విలీనం కావాలంటే... ఈ 15 మందిలో మూడింట రెండొంతులు అంటే 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమై, విలీన తీర్మానం చేయాల్సి ఉంటుంది. మంగళవారం పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో కలిపి ఇప్పటికే ఏడుగురు.. తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), సీహెచ్ ధర్మారెడ్డి (పరకాల), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), జి.సాయన్న (కంటోన్మెంట్) టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో విలీనం కావడానికి మరో ముగ్గురు శాసనసభ్యులు అవసరం అవుతారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికకు దాదాపుగా రంగం సిద్ధమైంది. వారితో ఫిరాయింపు ఎమ్మెల్యేల బలం తొమ్మిదికి చేరుతుంది.

 

 ఈ చేరిక వచ్చే వారంలోగా పూర్తవుతుందని సమాచారం. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చేరిక నెలాఖరులో ఉండనుంది. ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ చీలికవర్గం ఎమ్మెల్యేలు సమావేశమై.. తమదే అసలు తెలుగుదేశం శాసనసభాపక్షంగా పేర్కొంటూ టీఆర్‌ఎస్‌లో విలీనానికి తీర్మానం చేస్తారని సమాచారం. మరోవైపు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య (ఎల్‌బీనగర్) చాలా కాలం నుంచే టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కూడా. ‘‘టీఆర్‌ఎస్‌లో చేరుతామని వస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే. మాకు అవసరమైన సంఖ్యను త్వరలోనే సాధిస్తాం..’’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top