టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నాం

టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నాం - Sakshi


స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ చీలికవర్గం

సంతకాలు చేసిన మూడింట రెండొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు

మెజారిటీ తమకే ఉందని లేఖలో స్పష్టీకరణ

టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని అభ్యర్థన

మమ్మల్ని టీఆర్‌ఎస్ జాబితాలోకి మార్చండి: ఎర్రబెల్లి  


 

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీనంపై ఊహించిందే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే కార్యక్రమం చివరి అంకానికి వచ్చింది. టీడీపీకి చెందిన మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో.. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షాన్ని (టీటీడీఎల్పీ) టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు నాయకత్వంలో తెలుగుదేశం చీలిక వర్గం శాసనసభ్యులు స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి లేఖ రాశారు. దశల వారీగా తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను శుక్రవారం స్పీకర్‌కు అందజేశారు. టీ టీడీపీ శాసనసభాపక్షంలోని 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనం కావాలని గురువారం రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయించారని... మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నామని లేఖలో ఎర్రబెల్లి పేర్కొన్నారు.

 

ఇలా విలీనం కావడానికి రాజ్యాంగం (పదో షెడ్యూలు, 4వ పేరా)లోని నిబంధనల ప్రకారం కావాల్సిన మెజారిటీ తమకు ఉందని చెప్పారు. తమ విలీనాన్ని గుర్తించి టీఆర్‌ఎస్ శాసనసభ్యుల జాబితాలోనే తమ పది మంది పేర్లను చూపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్, జి.సాయన్న, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానంద, చల్ల ధర్మారెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి సంతకాలు చేశారు.    

 

చట్టంలో ఏముందంటే...

ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు వేరే పార్టీలో విలీనం కాదలచుకుంటే... ఆ చట్టసభలో ఆ పార్టీకి ఉన్న మొత్తం సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది దానికి అంగీకరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌లోని నాలుగో పేరాలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన మేరకే తెలుగుదేశం పార్టీ చీలికవర్గం శాసనసభ్యులు తమను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ గుర్తించిన తర్వాత నిర్వహించే శాసనసభ సమావేశాల నుంచి వీరిని అధికారికంగా టీఆర్‌ఎస్ సభ్యులుగా పరిగణిస్తారు. వారు టీఆర్‌ఎస్ సభ్యుల సరసన కూర్చుంటారు.

 

రాజ్యాంగం పదో షెడ్యూల్‌లోని నిబంధన..

(2) For the purposes of subparagraph (1) of this paragraph, the merger of the original political party of a member of a House shall be deemed to have taken place if, and only if, not less than twothirds of the members of the legislature party concerned have agreed to such merger.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top