గులాబీ శ్రేణుల్లో జోష్

గులాబీ శ్రేణుల్లో జోష్


సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విజయంతో టీఆర్‌ఎస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల్లో ఊహించినదాని కంటే ఎక్కువ డివిజన్లు గెలుచుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత జరిగిన మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు మొదలు.. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ జైత్రయాత్ర సాగిస్తోంది. అదే క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ విజయదుందుబి మోగించింది.

 

 గడచిన 22 నెలల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేసిన టీఆర్‌ఎస్.. నగర ప్రజల్లో విశ్వాసాన్ని పెంచగలిగింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికను సీఎం సహా మంత్రులు, ఇతర నేతలు ప్రజల్లోకి తీసుకుపోగలిగారు. ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లపై విసృ్తతంగా ప్రచారం చేశారు.

 

 తాము గ్రేటర్ పీఠం దక్కించుకుంటే జంట నగరాల్లోని ప్రజలకు ఇదే తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. దీనికితోడు పెన్షన్లు, కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా ఆరు కేజీల రేషన్ బియ్యం, ఇళ్లపట్టాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ, విద్యుత్, నీటి కుళాయిల బిల్లుల రద్దు వం టివి తమకు కలిసి వ చ్చాయన్న భావన లో టీఆర్‌ఎస్ నా యకత్వం ఉంది.

 

 పకడ్బందీగా..

 గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార వ్యూహం దాకా టీఆర్‌ఎస్ పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించింది. కేబినెట్‌లోని మంత్రులందరికీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లా సీనియర్ నేతలు డివిజన్ల వారీగా బాధ్యతలు పంచుకుని ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం కేసీఆర్ మీట్ ది ప్రెస్ ద్వారా నిర్వహించిన ఇ-క్యాంపేయిన్, ప్రచారం ముగింపునకు ఒకరోజు ముందు నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం, నగర ప్రజలకు ఇచ్చిన హామీలు తమకు తిరుగులేని మెజారిటీని సాధించి పెట్టాయని నేతలు పేర్కొంటున్నారు. ఫలితాలు వెలువడడం మొదలు కాగానే పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

 

 టీఆర్‌ఎస్‌కు 42 శాతం ఓట్లు

 గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు తేల్చిన లెక్కల ప్రకారం.. ఆ పార్టీ సుమారు 14,17,190 (పటాన్‌చెరు మినహా) ఓట్లతో 42 శాతం ఓట్లను పొందింది. అలాగే 9, 97,011 ఓట్లతో ఎంఐఎం 29 శాతం, టీడీపీ, బీజేపీ కూటమి 7,42,955 ఓట్లతో 18 శాతం, 3,09,231 ఓట్లతో కాంగ్రెస్ 9 శాతం ఓట్లను సాధించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top