‘నామినేటెడ్’ నామమాత్రమే

‘నామినేటెడ్’ నామమాత్రమే - Sakshi


 నిరాశలో గులాబీ శ్రేణులు  అవకాశం కోసం సీనియర్ల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్: గులాబీ శ్రేణులు ఇంకా నిరాశలోనే మునిగి ఉన్నాయి. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్లకు చివరకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. వివిధ కార్పొరేషన్లు, మార్కెట్, దేవాదాయ, గ్రంథాలయ సంస్థల వంటి పదవులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కలిపి సుమారు 4 వేలకు పైగానే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇంకా ఆచరణ రూపం దాల్చలేదు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా భర్తీ చేసిన రాష్ట్రస్థాయి పదవులు కనీసం ఇరవై కూడా లేవు. మరోవైపు ఇప్పటి దాకా భర్తీ అయిన పదవుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళ లేరు.

 

 దీనికితోడు దసరా సందర్భంగా ఒకేసారి 9 కార్పొరేషన్లను భర్తీ చేసిన సీఎం కేసీఆర్ మరికొన్ని సంస్థల గురించి ఇంకా దృష్టి పెట్టలేదని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల పాలక మండళ్ల భర్తీ ప్రక్రియ మొదలైనా చాలా చోట్ల ఎంపికలే జరగలేదు. అలాగే జిల్లా స్థాయిలోనే ఉండే దేవాదాయ కమిటీలకు నోటిఫికేషన్ జారీ అయినా ఇప్పటికీ భర్తీ ప్రకియ మొదలు కాలేదు.

 

 వేములవాడ, యాదాద్రి వంటి ఆలయాల పాలక మండళ్లకూ అతీగతీలేదు. దీంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న పార్టీ సీనియర్లు, ఇతర ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మరోవైపు పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులై కోర్టు తీర్పుతో ఆ పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర స్థాయి పదవులను ఆశించే వారి జాబితాలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండటంతో పదవులు ఎప్పుడు దక్కుతాయా అని ఎదురుచూస్తున్నారు.

 

 దీపావళికి పదవులు దక్కేనా?

 పార్టీ వర్గాల సమాచారం మేరకు దీపావళికల్లా మరికొన్ని కార్పొరేషన్ల పదవులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ విడతలో మిహ ళలు, ముస్లింలు, యువతకు అవకాశం దక్కుతుందని ఆ వర్గాలు పేర్కొం టున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్, స్త్రీ, శిశు సంక్షేమ రీజనల్ కమిటీలు, వక్ఫ్ బోర్డు, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, వికలాంగ కార్పొరేషన్లు, హార్టీకల్చర్ కార్పొరేషన్, హుడా, హౌసింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఇంకా పాలక మండళ్ల భర్తీకి నోచుకోలేదు.

 

 దీంతో ఈసారి వీటిలో కనీసం కొన్నైనా భర్తీ అవుతాయని, మహిళలకు అవకాశం ఉంటుందంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్టీ 15వ ప్లీనరీ సందర్భంగా ఆర్టీసీ, మిషన్ భగీరథ వంటి సంస్థలకు ఇద్దరు ఎమ్మెల్యేలను అధినాయకత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్టును భర్తీ చేశాక, దసరా కానుకగా తొమ్మిది కార్పొరేషన్లను భర్తీ చేయడంతో కొందరు సీనియర్లను పదవులు వరించాయి. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు ద్వారా సభ్యులుగా ఇద్దరికి (పార్టీతో సంబంధంలేని తటస్థునికే చైర్మన్ పదవి లభించింది) అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్లు మరికొన్ని కార్పొరేషన్ల పదవులను దీపావళికి భర్తీ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top