గ్రేటర్‌లో గులాబీ జోష్!

గ్రేటర్‌లో గులాబీ జోష్! - Sakshi


ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు..

వేదికల ఏర్పాటు బాధ్యత నగర మంత్రులకే..

సిటీ అంతటా గులాబీ తోరణాలు,ఫ్లెక్సీలు, కటౌట్‌లే..


 

సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ నేపథ్యంలో గ్రేటర్ నగరం గులాబీ వనంలా మారింది. మహానగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు పార్టీ జెండాలు, తోరణాలు,ఫ్లెక్సీలు, కటౌట్‌లతో నిండిపోయింది. తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఘనస్వాగతం పలికేందుకు ఆయా జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే రహదారులపై 150 వరకు భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు.



సుమారు 75 వేల భారీ గులాబీ జెండాలు, 50 వేల చిన్న జెండాలు, 50 లక్షల పార్టీ తోరణాలతో నగరాన్ని ముస్తాబు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు వంటి పథకాలపై 400 భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఎల్బీస్టేడియం కూడా గులాబీ వర్ణ శోభితమైంది. ఎల్‌బీ స్టేడియంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు భారీ స్టేజి ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు.



ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేయనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు ఎల్బీస్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు.



గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు  ఇటీవలే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో గ్రేటర్ గులాబీ దళంలో జోష్ మొదలైంది. ఆయన నేతృత్వంలో పార్టీలోని అన్ని వర్గాలను, గ్రూపులను కలుపుకొనిపోవడంతోపాటు రాబోయే బల్దియా ఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని, ముందుగా ప్లీనరీని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని గ్రేటర్ టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు.



2 వేల మంది పోలీసులతో బందోబస్తు : కమిషనర్ మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఆయన ఎల్బీస్టేడియాన్ని సందర్శించారు. అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. 24 గంటలు బందోబస్తును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలను కేటాయించారు. నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్, ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్క్ తదితర కేటాయించిన ప్రాంతాలలోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top