చెల్లింపులన్నీ ఆపేయండి!


ట్రెజరీలకు ఆర్థికశాఖ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిధుల విడుదలపై ఫ్రీజింగ్ విధించింది. ప్రస్తుతమున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ముందుజాగ్రత్తగా బిల్లుల చెల్లింపులు నిలిపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలిచ్చింది. జీతాలు, పెన్షన్లు తప్ప  జరుగుతున్న పనులకు సంబంధించిన బిల్లులన్నీ నిలిపివేయాలని సూచించింది.



ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 2,500 కోట్ల ఖజానా లోటుతో రాష్ట్రం సతమతమవుతుండగా ఇటీవల ఐటీ శాఖ అనూహ్యంగా రూ.1,274 కోట్లు సీజ్ చేయటంతో ఆర్థికశాఖ చిక్కుల్లో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణావసరాలైన రుణమాఫీ, రీయింబర్స్‌మెంట్, జీతాలు, పెన్షన్లకు నిధుల సర్దుబాటు చేసేందుకు ఫ్రీజింగ్ తప్పనిసరని భావిస్తోంది. రాష్ట్రంలో తొలి ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు వరకు బడ్జెట్ నిర్వహణ సాఫీగా సాగింది. నిధులు ఫ్రీజింగ్ అనే మాటెత్తకుండానే ఏ రోజుకారోజు బిల్లులు చెల్లించి ఆర్థికశాఖ ప్రత్యేకతను చాటుకుంది.



రెండో ఆర్థిక సంవత్సరంలో ఎంచుకున్న భారీ లక్ష్యాలకుతోడు ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి తొలి విడతగా రూ.2,000 కోట్లకుపైగా అప్పులు తెచ్చిన సర్కారు జూలైలో మంజూరయ్యే రెండో విడత రుణం కోసం ఎదురుచూస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, సీఎస్‌టీ బకాయిలు విడుదలైతే ఇప్పుడున్న చిక్కులు తొలిగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. నెలాఖరుకల్లా పరిస్థితి గాడిలో పడుతుందని అంచనా వస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top