సేఫ్ జర్నీ

సేఫ్ జర్నీ


సిటీ బస్సుల్లో మహిళలకిక సంపూర్ణ రక్షణ

స్లైడింగ్ డోర్లు ఏర్పాటు

ఆకతాయిలు, పిక్‌పాకెటర్లకు చెక్

పురుషులకు నో ఎంట్రీ

రేతిఫైల్ బస్‌స్టేషన్‌లో ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు


సికింద్రాబాద్: సిటీ బస్సుల్లో ఇక మహిళలు ఎలాంటి అభద్రత లేకుండా ప్రయాణించవచ్చు. ఆకతాయిల వేధింపులు, పికెపాకెటింగ్ సమస్యలకు చెక్‌పడనుంది. ఈమేరకు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ప్రత్యేకంగా స్లైడింగ్ బోగీలను ఏర్పాటు చేసిన మాదిరిగా... ఆర్టీసీ బస్సుల్లో సైతం ఈ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు.  సరికొత్త స్లైడింగ్ విధానాన్ని ఆదివారం ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్‌లో ప్రారంభించారు.



స్లైడింగ్ వ్యవస్థతో మహిళలకు కేటాయించిన సీట్ల ప్రదేశం వరకు పురుషులు ప్రవేశించే అవకాశం ఉండదు. సీట్ల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో సైతం మహిళలు మాత్రమే నిల్చునే అవకాశమే ఉంటుంది. మహిళలకు కేటాయించిన సీట్లకు అడ్డంగా రెయిలింగ్‌ను ఏర్పాటు చేసి అక్కడే స్లైడింగ్ డోర్‌ను ఏర్పాటు చేశారు.దీంతో మహిళలకు ప్రత్యేక చాంబర్ ఏర్పాటయినట్లయింది.

 

త్వరలో అన్ని బస్సుల్లో...

సిటీ బస్సుల్లో మహిళలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం కోసమే స్లైడింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు చెప్పారు.రెతిఫైల్ బస్‌స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్కో బస్సుకు స్లైడింగ్ డోర్‌ను ఏర్పాటుకు రూ.16.500 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని 50 బస్సులకు స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేయించామన్నారు. రానున్న రోజుల్లో నగరంలో తిరుగుతున్న 2400 సిటీ బస్సుల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. పిక్‌పాకెటింగ్, ఈవ్‌టీజింగ్ ఎక్కువగా ఆర్డినరీ బస్సుల్లో జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆ బస్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణారావు, గ్రేటర్ ఆర్టీసీ ఈడీ జయారావు, సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

సురక్షితం

ఆర్టీసీ బస్సుల్లో స్లైడింగ్ వ్యవస్థ ఏర్పాటు బాగుంది. ఇది మాకు ఎంతో భద్రత కల్పిస్తుంది. నిత్యం బస్సు ప్రయాణంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నాం. ఇక ఈ బెడద తగ్గుతుందని భావిస్తున్నా.

-అనిత, ఉద్యోగిని, చిలకలగూడ

 

దొంగతనాలు జరగవు


ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో ఇకపై దొంగతనాలు జరిగే అవకాశం ఉండదు. మహిళలకు కేటాయించిన ప్రదేశంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిరోధించడం సబబే. మహిళల సీట్లలో తిష్టవేసిన వారిని బతిమిలాడుకునే ఇబ్బందులు ఉండవు.         -నయీమాబేగం, మేడ్చల్

 

ఇబ్బందులు తప్పాయి

మహిళల సీట్ల మధ్యకు వచ్చి నిల్చునే ఆకతాయిలను తప్పిం చడం, మహిళలకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యే వారిని పంపించడం మాకు తలనొప్పిగా మారింది. స్లైడింగ్ విధానం వల్ల మాకూ ఇబ్బందులు తప్పుతాయి.

-లలిత, లేడీ కండక్టర్, జీడిమెట్ల డిపో

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top