ఇక గగనతలం!

ఇక  గగనతలం! - Sakshi


*దాడులకు ముష్కరుల కొత్త మార్గం

*నిఘా వర్గాల హెచ్చరికలు అనధికారిక డ్రోన్లు, పారాగ్లైడర్లు  నిషేధించాలని స్పష్టీకరణ

*నగరంలో వినియోగంపై నిషేధం పొడిగింపు  గోవాలో శిక్షణ పొందిన ‘జంట పేలుళ్ల’ నిందితుడు


ముష్కర మూకలు అకృత్యాలకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదులు గగనతల దాడులకు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే జంట కమిషనరేట్ల అధికారులు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో వీటిపై నిషేధం విధించారు. నగరంలో అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం  ఉత్తర్వులు జారీ చేశారు.

 

సిటీబ్యూరో:  కేంద్ర నిఘా వర్గాలు గగనతల దాడులపై పదే పదే హెచ్చరించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాల ఆధారాలనూ నిఘా వర్గాలు సేకరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాకు చెందిన ఉగ్రవాది సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ, ఖలిస్థాన్ మిలిటెంట్ నాయకుడు జక్తార్ సింగ్ తారాలను నిఘా వర్గాలు విచారించడంతోముష్కర సంస్థల వ్యూహం వెలుగులోకి వచ్చింది.


 


పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు బయటపెట్టారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు చెందిన ఓ వింగ్ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనా, యూఏఈ కంపెనీల నుంచి పారాగ్లైడర్ల తయారీకి ఉపకరించే ఉపకరణాలు, పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డ్రోన్లు ఖరీదు చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటికి తోడు గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన గగనతల కొనుగోళ్లకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన ఆధారాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి.


శిక్షణ పొందిన అఫాఖీ...

దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ ఆఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ సైతం పారాగ్లైడింగ్‌లో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జంట పేలుళ్లకు అవసరమైన పదార్థాలను సరఫరా చేశాడన్నది ఇతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. భత్కల్, బెంగళూరుల్లో నివసించిన ఇతడు అరెస్టు కావడానికి ముందు గోవాలోని ఖేరీ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.


బెంగళూరుకు చెందిన రామన్ పర్యవేక్షణలో 2013 నవంబర్‌లో కొన్ని వారాల పాటు శిక్షణ పొందినట్లు బయటపెట్టాడు. వృత్తిరీత్యా పారాగ్లైడింగ్ శిక్షకుడైన రామన్‌కు అసలు విషయం చెప్పకుండా సరదా కోసమంటూ అఫాఖీ నేర్చుకున్నాడు. ఐఎం గగనతల దాడుల కుట్రలో భాగంగానే ఈ శిక్షణ తీసుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.



మినీ హెలీకాఫ్టర్లపై మావోల కన్ను....

 మావోయిస్టుల దృష్టి ఇప్పుడు మినీ హెలీకాఫ్టర్ల తయారీపై పడినట్టు వెలుగులోకి వచ్చింది. బీహార్, కేరళల్లో జరిగిన ఆపరేషన్ల సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ బరువు, సామర్థ్యం కలిగినవి రూపొందించి వినియోగించడానికి మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటికి సంబంధించిన ఓ డిజైన్ బీహార్‌లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసుఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. ఇప్పటి వరకు విధ్వంసాల కోసం మావోయిస్టులు ఎక్కువగా మందుపాతరలనే ప్రయోగిస్తున్నారు. వీటికి భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటినీ గగనతలం ద్వారా వినియోగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.



నవంబర్ 7 వరకు నిషేధం పొడిగింపు...

నగరంలో అనధికారిక డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే ఎగిరే వస్తువులు, చిన్నపాటి మానవ రహిత విమానాల వినియోగంపై నిషేధాన్ని నవంబర్ 7 వరకు పొడిగిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గగనతల దాడులపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీటిని ఎవరైనా వినియోగించాలన్నా కచ్చితంగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top