క్రమబద్ధీకరణ గడువు పెంపు ఉండదు

క్రమబద్ధీకరణ గడువు పెంపు ఉండదు - Sakshi


♦ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

♦ పురపాలనలో కఠిన నిర్ణయాలు తప్పవు

♦ అనుమతులు ఉల్లంఘించే భవనాలు ప్రభుత్వ స్వాధీనం

♦ ఈ నెలాఖరులోగా అన్ని పురపాలికల్లో 100 రోజుల ఎజెండా

♦ ప్రజలు 100 శాతం పన్నులు కట్టాల్సిందే...

♦ పన్నుల పెంపూ ఉంటుంది

♦ పురపాలక శాఖపై కేటీఆర్ సమీక్ష

 

 సాక్షి, హైదరాబాద్: పురపాలన, పట్టణాభివృద్ధిలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. అనుమతులు ఉల్లంఘించి నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో అనుమతులు ఉల్లంఘించి భవనంలో నిర్మించిన భాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందని స్పష్టంచేశారు. ఇందుకు తగ్గట్లు భవన నిర్మాణ చట్టాల్లో సవరణలు తెస్తామని తేల్చిచెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 రోజుల్లో ఆన్‌లైన్ అనుమతులను ప్రవేశపెట్టబోతున్నామన్నారు.



ఇకపై భవనాలకు 30 రోజుల్లో అనుమతులు, 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు. పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, పురపాలక శాఖ డెరైక్టర్ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో కలసి ఆయా విభాగాల పనితీరుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అందులో తీసుకున్న నిర్ణయాలను అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు.



అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా.. మరోసారి గడువును పెంచే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ నెలాఖరుకల్లా ప్రతి ఒక్క విభాగాధిపతి, ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ 100 రోజుల ఎజెండాతో ప్రజల ముందుకు వస్తారన్నారు. ఈ వంద రోజుల్లో ఏం చేయబోతున్నామో ఎజెండాలో వివరిస్తామన్నారు. దీంతోపాటు ప్రతి పురపాలిక ఇకపై ఏటా వార్షిక పురోగతి నివేదిక, వార్షిక ప్రణాళికను ప్రకటిస్తాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో నెరవేర్చుతామన్నారు. చర్యలు తీసుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను అధికారులకు అందజేసినట్లు కేటీఆర్ చెప్పారు.



 నిధుల సమీకరణ బాధ్యత టీయూఎఫ్‌ఐడీసీకి...

 జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే రా ష్ట్రంలోని ఇతర పురపాలికలకు కావాల్సిన నిధులను సమీకరిం చే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పట్టణ ఆర్థిక సహకార, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ)కు అప్పగిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ సైతం సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి సూచనలు చేశామన్నారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పురపాలనలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పురపాలికలు/ ఇతర సంస్థలను గుర్తించి అక్కడి అధికారులను ఈ శిక్షణకు రప్పిస్తామన్నారు. శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సైతం వీరి నుంచి శిక్షణ స్వీకరిస్తారని పేర్కొన్నారు.

 

 100 శాతం పన్నుల వసూళ్లు

 నగర, పురపాలక సంస్థల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు భాగస్వామ్య ప్రజాస్వామ్య పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని, అవసరమైతే చట్టాలకు సవరణలు చేయాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు సొంత ఆదాయ వనరులను పెంచుకొని, అనవసర ఖర్చులను తగ్గించుకొని స్వయం సంమృద్ధి సాధించేందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అదేవిధంగా పురపాలికలకు ప్రజలు 100 శాతం పన్నులు చెల్లించేలా ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామన్నారు. ఆస్తి పన్నుల పెంపు ఉంటుందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top