‘మెట్రో’ స్థలం మార్చలేదు


ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు అనుకూలంగా వ్యవహరించలేదు: టీఎస్‌ఐఐసీ



సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని మార్చలేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) స్పష్టం చేసింది. ఆక్వా స్పేస్ డెవలపర్స్ కోసం ఎటువంటి ఆశ్రీత పక్షపాతం చూపలేదని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌ఐఐసీ వీసీ, ఎండీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2007లో రూ. 580.50 కోట్లను చెల్లించి రాయదుర్గంలోని ఏపీఐఐసీ భూమిని డీఎల్‌ఎఫ్ (ప్రస్తుతం ఆక్వా స్పేస్ డెవలపర్స్) కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు.



ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అయిందని తెలిపారు. అయితే ఆ భూమిలో వారసత్వ సంపద (పురాతన శిలా ఫలకాలు) ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా వేలంలో కొన్న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.90 కోట్లను, రూ. 31.92 కోట్ల స్టాంపు డ్యూటీని 2013 సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ చెల్లించిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా ఏడేళ్ల తర్వాత 2014 ఆగస్ట్‌లో ఆ సంస్థతో ఎక్స్ఛేంజ్ డీడ్ కుదుర్చుకున్నామన్నారు. సంస్థ పేరు మార్పునకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) కూడా అంగీకరించిందని.. పేరు మార్పు పూర్తిగా చట్టపరమైనదని, ఇందులో ఎటువంటి తప్పు లేదని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top