హైదరాబాద్‌లో థీమ్ థియేటర్


- రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించనున్న హాలీవుడ్ సంస్థ డ్రీమ్‌వర్క్స్

- తమ సినిమాల ప్రదర్శనకు హై ఎండ్ థియేటర్

- పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణగా డ్రీమ్ ప్లే’

- డ్రీమ్‌వర్క్స్, ఐ హబ్ సీఈవోలతో కేటీఆర్ భేటీ

- తమ ప్రణాళికలకు భాగ్యనగరం అనుకూలమన్న డ్రీమ్‌వర్క్స్ సీఈవో




సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ డ్రీమ్‌వర్క్స్.. తమ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకునే యోచనలో ఉంది. తాము నిర్మించే సినిమాలను ప్రదర్శించేందుకు హై ఎండ్ ఎకోసిస్టమ్ థియేటర్‌ను ఏర్పాటు చేయనుంది. డ్రీమ్ ప్లే’ పేరిట రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‌ను నిర్మించనుంది. రెండు వారాల అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కె.తారక రామారావు ఐదోరోజు లాస్ ఏంజెల్స్‌లో పర్యటించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ యానిమేషన్ స్టూడియో డ్రీమ్‌వర్క్స్ కార్యాలయంలో సంస్థ సీఈవో జెఫ్రీ కాట్జన్‌బర్గ్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో తమ ప్రొడక్షన్ సౌకర్యాలను విస్తరించే యోచనలో వున్నామని, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ఆశిసున్నట్లు కాట్జన్‌బర్గ్ వెల్లడించారు. భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డ్రీమ్‌వర్క్స్ ప్రణాళికలకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. చురుకైన సినిమా రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం అనుకూలాంశమని అన్నారు. డ్రీమ్‌వర్క్స్ ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.



హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్‌సిటీ ప్రత్యేకతలను వివరిస్తూ.. అది డ్రీమ్‌వర్క్స్ భవిష్యత్ ప్రొడక్షన్ సౌకర్యాలకు అత్యంత అనుకూలంగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్‌వర్క్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసే థీమ్ థియేటర్ హైదరాబాద్ పర్యాటక రంగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా కాట్జన్‌బర్గ్‌ను మంత్రి ఆహ్వానించారు. ఐ హబ్ ఇంక్యుబేటర్ పనితీరుపై ఆరా లాస్ ఏంజెల్స్ ఇన్నోవే షన్ సెంటర్ ఐ హబ్’ ఇంక్యుబేటర్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఐ హబ్ ఇంక్యుబేటర్ పనితీరు, అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రత్యేకతలను వివరించిన మంత్రి.. ఐ హబ్ సహకారం, భాగస్వామ్యాన్ని కోరారు. రాష్ట పర్యటనకు రావాల్సిందిగా ఐ హబ్ సీఈఓ, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. తెలంగాణ తరహాలో నీటి యాజమాన్యం, మురుగునీటిని శుద్ధజలంగా మార్చడం వంటి ఆవిష్కరణలు ఐ హబ్‌లో కూడా జరుగుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top