టీచర్ల బదిలీలు మరింత ఆలస్యం


-రెండురకాల షెడ్యూళ్లను రూపొందించిన పాఠశాలవిద్యాశాఖ

- ప్రతిపాదనలపై ఎటూ తేల్చని ప్రభుత్వం



సాక్షి, హైదరాబాద్


 టీచర్ల బదిలీలు, ప్రభుత్వ పాఠశాలల రెండో విడత రేషనలైజేషన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పంపిన షెడ్యూళ్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెటింది. దీంతో అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నా విద్యాశాఖలో టీచర్లంతా వాటికోసం ఎదురుచూపుల్లో ఉన్నా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను త్వరితంగా ముగించాలని ఇటీవల పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.


 


విద్యాశాఖకు సంబంధించి బదిలీల ప్రక్రియ పాఠశాలల రేషనలైజేషన్‌తో ముడిపడి ఉండడంతో ఇంకా ప్రారంభించలేకపోయారు. వేసవిసెలవుల్లోనే రేషనలైజేషన్ పూర్తిచేయాల్సి ఉండగా ఇంతవరకు ఎందుకు జాప్యం చేశారని ఇటీవల విద్యాశాఖ సమీక్షలో సీఎం అధికారులను నిలదీశారు. వెంటనే బదిలీలు పూర్తిచేయాలని స్పష్టంచేశారు. దీంతో గత వారంలో విద్యాశాఖ రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించి రెండు వేర్వేరు షెడ్యూళ్ల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ఈ రెండు ప్రక్రియలు మంగళవారం (28వ తేదీ) నుంచే ప్రారంభమయ్యేలా దీన్ని తయారుచేసింది.


 


ఈరెండు కార్యక్రమాలు ఆగస్టు 1కల్లా పూర్తయ్యేలా షెడ్యూళ్లను ఇచ్చింది. ఒకటి రేషనలైజేషన్‌ను పూర్తిచేస్తూనే బదిలీల ప్రక్రియను చేపట్టేలా ఒక షెడ్యూల్‌ను రూపొందించారు. రేషనలైజేషన్‌తోసంబంధం లేకుండా బదిలీల ప్రక్రియను మాత్రమే చేపట్టేలా మరో షెడ్యూల్‌ను ప్రతిపాదించారు. అయితే ముహూర్తం సమీపించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కావలసిన రెండు ప్రక్రియలు మరింత ఆలస్యం కానున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top