మంత్రి చెబితే మాకేంటి?

మంత్రి చెబితే మాకేంటి?


కేటీఆర్ స్వయంగా పరిశీలించినా.. మారని శ్రీనగర్ కాలనీ రహదారి దుస్థితి


 


మంత్రి అయితే మాకేంటి? అనుకున్నారో...ఇది మా పని కాదనుకున్నారో...మళ్లీ వచ్చి మంత్రి చూడరులే అనుకున్నారో గానీ శ్రీనగర్‌కాలనీ రోడ్డు దుస్థితి, పారిశుధ్య లోపంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నెల 13న మంత్రి కేటీర్ ఈ ప్రాంతంలో పర్యటించి స్వయంగా అధికారులకు చివాట్లు పెట్టారు. అడ్డగోలుగా తవ్విన రోడ్లు.. మట్టి, బురదతో నిండిపోయిన ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీల దుర్గంధం, మ్యాన్‌హోళ్ల లీకేజీలతో దుర్వాసనతో అధ్వానంగా మారిన శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డును ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి నిలదీశారు. ప్రతి సమస్య గురించి కమిషనర్, మేయర్, మంత్రి వచ్చి చెప్పాలా అంటూ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు ఆనందపడ్డారు. స్వయంగా మంత్రిగారే పర్యటించారు కాబట్టి ఇక శ్రీనగర్ కాలనీ రోడ్ల దుస్థితి మారుతుందని ఆశించారు. వెంటనే పనులు మొదలవుతాయని భావించారు. కానీ మంత్రి పర్యటించి రెండు వారాలు దాటినా ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదు కదా..వర్షాల కారణంగా మరింత అధ్వానంగా మారింది.  కనీసం నడవడానికి కూడా వీల్లేని స్థితిలో రోడ్డంతా బురదమయం అయింది. డ్రైనేజీ మురుగునీరు కంపుకొడుతున్నది.





వరద, మురుగునీరు తిష్టవేసి దుర్గంధం పేరుకుపోయి స్థానికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. మేయర్, కమిషనర్, సెంట్రల్ జోనల్ కమిషనర్, డీఎంసీలు... ఇలా అంతా ఆ రోజు మంత్రి వెంట వచ్చారు. మంత్రి ఆదేశించిన తర్వాత రోడ్డు బాగు పడిందా లేదా అన్నదానిపై ఇప్పటిదాకా వారూ సమీక్షజరిపిన పాపాన పోలేదు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఒక వైపు ప్రకటనలు చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.     - బంజారాహిల్స్


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top