రూ.1కే నల్లా...

రూ.1కే నల్లా...


13 లక్షల కుటుంబాలకు లబ్ధి

నిరుపేదల దాహార్తి తీరే అవకాశం

శివారు ప్రజలకు ఊరట

ఏడాదిలో మంచినీటి సరఫరా  వ్యవస్థ ఏర్పాటుచేస్తేనే ప్రయోజనం


 


ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ పథకం లబ్ధి ఇలా...   ఒక్కో నల్లాకు నెలకు సరఫరా చేసే నీటి పరిమాణం:15 వేల లీటర్లు నెలవారీగా చెల్లించాల్సిన నీటిబిల్లు: రూ.150  తక్షణం కనెక్షన్లు ఇవ్వాలంటే..: రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన పైపులైన్ పనులను ఏడాదిలో పూర్తిచేయాలి. వెయ్యి కాలనీల్లో సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. {పస్తుతం గ్రేటర్‌లో ఉన్న నల్లా కనెక్షన్లు: 8.75 లక్షలు (మురికివాడల్లో సుమారు 2 లక్షల కనెక్షన్లు)   రోజువారీగా జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు: 356 మిలియన్ గ్యాలన్లు రోజువారీగా నీటి డిమాండ్: 542 మిలియన్ గ్యాలన్లు నూతన నల్లా కనెక్షన్ల ఏర్పాటుతోనీటి డిమాండ్: నిత్యం 1000 మిలియన్ గ్యాలన్లు


 


సిటీబ్యూరో: నిరుపేదల దాహార్తిని తీర్చేందుకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో రూపాయికే నల్లా కనెక్షన్ జారీచేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గ్రేటర్ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ నిర్ణయం ద్వారా గ్రేటర్ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు 13 లక్షల నిరుపేద కుటుంబాల దాహార్తి తీరనుంది.మహానగర పరిధిలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లాకనెక్షన్లుండగా..మురికివాడల్లో సుమారు రెండు లక్షల నల్లాలున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 13 లక్షల కుటుంబాలకు దశలవారీగా రూపాయికే నల్లా కనెక్షన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రూ.200కే కనెక్షన్ మంజూరు చేసేవారు. సర్కారు తాజా నిర్ణయంతో ఒక్కో కుటుంబానికి రూ.199 ఆదా కానుంది.





కాగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీల్లో మంచినీటిసరఫరా  వ్యవస్థ, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం హడ్కో సంస్థ జారీచేసిన రూ.1900 కోట్ల నిధులతో ఆయా ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ఈనేపథ్యంలో మరో ఏడాదిలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పది లక్షల పేద కుటుంబాలకు రూ.1 కే నల్లా కనెక్షన్లు ఏర్పాటు కానున్నాయని జలమండలి వర్గాలు తెలిపాయి.అయితే రూ.1కే కనెక్షన్ ఇచ్చినా..నెలకు ఒక్కో కుటుంబానికి సరఫరా చేయనున్న 15 వేల లీటర్ల నీటికి రూ.150 నీటిబిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశాయి. మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాలకు తక్షణం కనెక్షన్ ఇస్తామని తెలిపాయి.


 

సరఫరా వ్యవస్థ ఏర్పాటుతోనే ప్రయోజనం..


625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ సుమారు వెయ్యి కాలనీల్లో మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. రూ.1కే నల్లా కనెక్షన్ మంజూరు చేసినా..మంచినీరందించే వ్యవస్థ లేకపోవడం గమనార్హం. హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్లతో ఇటీవల చేపట్టిన మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులను ఏడాదిలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తేనే రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదల దాహార్తి తీరనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.


 

నల్లాలు సరే..నీళ్లేవి...?


మహానగరం జనాభా కోటికి చేరువైంది. కానీ మొన్నటివరకు రాజధాని దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా(మెదక్), హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే ఆదరువయ్యాయి. ప్రస్తుతం కృష్ణామూడుదశలద్వారా 270, గోదావరి మొదటిదశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని నగరానికి అత్యవసర పంపింగ్ ద్వారా తరలించి 8.75 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. కానీ నీటి డిమాండ్ 542 మిలియన్ గ్యాలన్లుగా ఉండడం గమనార్హం. అంటే ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటికి..డిమాండ్ మధ్య అంతరం 186 మిలియన్ గ్యాలన్లుగా ఉంది. ఇక భవిష్యత్‌లో నల్లా కనెక్షన్ల సంఖ్య మరో 13 లక్షలు పెరిగితే నీటి డిమాండ్ వెయ్యి మిలియన్ గ్యాలన్లకు చేరుకోవడం తథ్యం. ఈనేపథ్యంలో ఈ స్థాయిలో నీటిని ఎక్కడినుంచి తరలిస్తారన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ శివార్లలో శామీర్‌పేట్(గోదావరిజలాలు), మల్కాపూర్(కృష్ణాజలాలు)లలో యుద్దప్రాతిపదికన రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించి 40 టీఎంసీల నీటిని సీజన్‌లో నిల్వచేస్తేనే గ్రేటర్ దాహార్తి తీరుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top