దొంగ దొంగది

దొంగ దొంగది - Sakshi


యజమాని ఇంట్లోనే చోరీ చేసిన ఉద్యోగి

సీసీ కెమెరాలకు చిక్కకుండా బుర్ఖా ధారణ

కుడికాలులో ఉన్న ఇబ్బందితో దొరికిన లీడ్

48 గంటల్లో ఛేదించిన నాంపల్లి పోలీసులు


 

ఈ రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే...చోరీ కోసం  ‘ఆడ’ వేషం వేసిన ఓ దొంగ దర్జాగా చోరీ చేసి బయటకొచ్చాడు. చివరకు నాటకీయంగా పోలీసులకు చిక్కాడు.

 

ఖైరతాబాద్: పని చేస్తున్న సంస్థ యజమాని ఇంట్లోనే చోరీ చేశాడు... సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు బుర్ఖా ధరించాడు...శిరస్సు మొదలు సిరిపాదం వరకు అన్నీ కప్పేసుకున్నాడు. అయినప్పటికీ ‘నడకలో’ ఉన్న తేడాతో అనుమానితుడిగా మారాడు. అదపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు... నాంపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం నమోదైన 44 తులాల బంగారం చోరీ కేసు నిందితుడి వ్యవహారమిది. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసులు బంగారం మొత్తం రికవరీ చేశారు. ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.





ఎక్కడ? ఏం జరిగింది?

లక్డీకాపూల్‌లోని ఎక్స్‌ప్రెస్ అపార్ట్‌మెంట్‌లో నివసించే శ్రీకాంత్ కార్పొరేట్ కార్యాలయాలకు ఆర్డర్స్‌పై గిఫ్ట్ ఆర్టికల్స్ సరఫరా చేస్తుండగా భార్య లక్ష్మి ప్రభుత్వ ఉద్యోగిని. అపార్ట్‌మెంట్‌లోని ‘ఏ బ్లాక్’లో నివాసం ఉం డగా... ‘బీ బ్లాక్’లో కార్యాలయం ఉంది. లక్ష్మి మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇల్లంతా కారంపొడి చల్లి ఉంది. బీరువా పరిశీలించగా... అందులో ఉండాల్సిన 44 తులాల బంగారు నగలు, రూ. 30 వేలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.





దర్యాప్తు ఎలా మొదలైంది?

ఘటనాస్థలికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ మధుమోహన్ నేతృత్వంలోని బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంటి తాళం పగులకొట్టకుండా ‘పని’ పూర్తి చేయడంతో చోరు డు తెలిసిన వ్యక్తిగా అనుమానించారు. దీంతో శ్రీకాంత్ వద్ద పని చేస్తున్న, ఇటీవల మానేసిన ఉద్యోగుల వివరాలు ఆరా తీసి జాబితా రూపొందించారు. అపార్ట్‌మెం ట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరి శీలించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బుర్ఖా ధరించిన ఒకరు అపార్ట్‌మెంట్‌లోకి, శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లడం... కొద్దిసేపటికి చేతిలో సంచితో బయటకు రావడం గుర్తించి అనుమానించారు. ఒంటికి బుర్ఖా, చేతులకు గ్లౌజ్, కాళ్లకు సాక్స్ ధరించిన దొంగ సీసీ కెమెరా, వేలిముద్రలు వంటి ఆధారాలు వదల కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేల్చారు. పోలీసు జాగిలాలకూ లీడ్స్ లేకుండా ఇంట్లో కారం చల్లినట్లు నిర్థారించారు.





ఆధారం ఎక్కడిది?

సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలోనే... బుర్ఖాలో ఉన్న వారి కుడికాలులో లోపం ఉన్నట్లు, కాస్త కుంటుతూ నడుస్తున్నట్లు స్పష్టమైంది. ‘ఉద్యోగుల జాబితా’లో ఇలాంటి లోపాలు ఉన్న వారి వివరాలు ఆరా తీయగా... తమిళనాడు ఉంచి వచ్చి పని చేస్తున్న ఓంప్రకాశ్ అనురాగ్ అలియాస్ హరి(28) విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రమాదానికి గురైన ఇతడి కుడికాలులో వైద్యులు రాడ్ వేడయంతో కుంటుతాడని, ఈ నెల ఏడో తేదీ నుంచి విధులకు రావట్లేదని తేలడంతో నిందితుడిగా భావించారు. గురువారం ఇతడి భార్య పని చేస్తున్న కార్యాలయం వద్ద మాటువేసి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తన యజమాని కారు తాళాలకే ఇంటి తాళం సైతం ఉండటంతో తస్కరించి చోరీ చేసి నకిలీది తయారు చేయించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడి నుంచి 44 తులాల బంగారంతో పాటు రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.



హరి నేపథ్యం ఏంటి?

తమిళనాడుకు చెందిన హరి ఇంటర్మీడియట్ ఫెయిలయ్యాడు. 2008లో వివాహం చేసుకొని నగరానికి వచ్చి యాప్రాల్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో ఉంటున్నాడు. 2009 నుంచి 2011 వరకు శ్రీకాంత్ కంపెనీలో, ఎస్పీ రోడ్డులో ఉన్న హోండా షోరూంలో పనిచేశాడు. గతేడాది మళ్లీ శ్రీకాంత్ సంస్థలోనే చేరాడు. దురలవాట్లకు బానిసై ఇంటినీ పట్టించుకోకుండా తయారయ్యాడు. శ్రీకాంత్ ఇంటినే టార్గెట్‌గా చేసుకుని సికింద్రాబాద్‌లో బుర్ఖా తదితరాలు ఖరీదు చేశాడు. ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరి ఓ సులభ్ కాంప్లెక్స్‌లో ‘వేషం’ మార్చుకున్నాడు. అక్కడ నుంచి లక్డీకాపూల్‌కు ఆటోలో వచ్చాడు. నడుచుకుంటూ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళి ‘పని’ పూర్తి చేశాడు. ‘సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారంతోనే ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించగలిగాం. దర్యాప్తులో సైఫాబాద్ ఏసీపీ జె.సురేందర్‌రెడ్డి, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్ ఎం.రాజు కీలకపాత్ర పోషించారు’ అని డీసీపీ పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top