అదే జోరు..నినాదాల హోరు

అదే జోరు..నినాదాల హోరు


కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన

టీ-లాయర్లకు మద్దతుగా జీహెచ్‌ఎంసీ ఎదుట ధర్నా


కేంద్ర మంత్రి సదానందగౌడపై సరూర్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు




యాకుత్‌పురా: న్యాయవాదుల ఆందోళన నా నాటికి ఉధృతమవుతోంది. వారికి మద్దతుగా వివిధ విభాగాలు మద్దతు ప్రకటిస్తున్నా యి.  పురానీహవేలిలోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. పురానీహవేలిలోని కోర్టు నుంచి హైకోర్టు వెళ్లేందుకు బయలుదేరిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ ఎ.మాణిక్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ... న్యాయం కోసం ఉద్యమిస్తున్న తమను అడ్డుకోవడం దారుణమన్నారు. కేంద్ర న్యాయ శాఖ, సుప్రీంకోర్టు వెంటనే స్పందించి హైకోర్టు విభజించి సీమాంధ్ర జడ్జిలను హైదరాబాద్ నుంచి పంపించాలన్నారు.


 

భారీగా బలగాల మోహరింపు


హైకోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నయాపూల్ నుంచి మదీనా చౌరస్తా వ ద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.సిటీ కాలేజీ చౌరస్తా వైపు నుంచి మూసి ప్రాంతంతో పాటు నయాపూల్ వైపు వెళ్లకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు.  దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.


 

జీహెచ్‌ఎంసీ ఎదుట ఆందోళన


తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మధ్యాహ్నం భోజనవిరామ సమయంలో ధర్నా నిర్వహించారు.ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ టి. వెంకటేశం మాట్లాడుతూ,  ఉమ్మడి హైకోర్టును విభజించి, తెలంగాణకు కేటాయించిన ఆంధ్ర జడ్జిలను వెనక్కుపంపాలన్నారు. జేఏసీ కో చైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ పోరాడి తెలంగాణ సాధించుకున్న తెలంగానలో తాము అదే స్ఫూర్తితో , అదే ఐక్యతతో హైకోర్టును విముక్తం చేసుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్స్ జేఏసీ  నాయకుడు కిషన్ మాట్లాడుతూ, లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లతోనే సమాజ బాగోగులు ఆధారపడ్డాయని న్యాయవాదులకు అండగా ఉంటామన్నారు.కార్యక్రమంలో మోహన్‌సింగ్, భూమన్న, హరిశంకర్, రమేశ్, రఘునందన్, మహేందర్, విజయకుమార్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.


 

కేంద్ర మంత్రి సదానందగౌడ్‌పై ఫిర్యాదు


చైతన్యపురి:  తెలంగాణకు  ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని కేంద్ర నాయశాఖామంత్రి సదానందగౌడ్‌పై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో అడ్వకేట్ జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అడ్వకేట్ జేఏసీల సమావేశంలో ప్రత్యే హైకోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఉపేందర్  ఫిర్యాదులో పేర్కొన్నారు. హామీని నెరవేర్చకుండా మోసం చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top