ఒక ఊరి చిత్రం

ఒక ఊరి చిత్రం


ఈ రోజుల్లో మొబైల్‌ఫోన్ లేని ఊరుందా? ఇంజక్షన్ అంటే తెలియని ప్రజలున్నారా? ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ ఇంకా అలాంటి గ్రామాలేంటి అంటారా?.. కానీ, అటువంటి గ్రామం ఉంది. అక్కడి ప్రజలకు మందులు తెలియవు. స్కూల్ మాట దేవుడెరుగు.. ఆ ఊరికి విద్యుత్తే లేదు. చుట్టూ గుట్టలు, లోయలు.



కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం. మేనిని తాకుతూ వెళ్లే మేఘాలు. స్వచ్ఛమైన నీటితో ఉరకలెత్తే సుఫిన్ నది. ఆత్మీయత నిండిన మనసులు. శ్రమే దైవంగా బతికే మనుషులు ఆ ఊరి సొంతం. ఆ గ్రామం పేరు కలాప్. ఆ అందాలను తన కెమెరాలో బంధించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఆనంద్‌శంకర్.

 ..:: శ్రావణ్ జయ

 

అబ్బురపరిచే ప్రకృతి ఉత్తరాఖండ్ జిల్లాలోని ఉత్తర కాశీలో ఉన్న కలాప్ సొంతం. 450 జనాభా ఉన్న ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామస్తులకు ఆదాయమార్గం అంటే  మేకలు, గొర్రెల పెంపకమే. ఆ ఊరికి హస్పిటల్, స్కూల్, కరెంటు వంటివేవీ లేవు. వాటి గురించి అక్కడ ప్రజలకూ తెలియదు. రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అసలే లేవు. ప్రభుత్వం అంటేనే తెలియదు అక్కడి ప్రజలకు. అలాంటివారిలో చైతన్యం కల్పించి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నాడు ఆనంద్ శంకర్.



బిజినెస్ స్టాండర్డ్‌లో జర్నలిస్ట్ వృత్తికి స్వస్తి చెప్పి, సొంతూరు బెంగళూరును వదిలి కలాప్‌లోనే నివాసముంటున్నాడు. ఆ ప్రజల జాగృతి కోసం ‘కలాప్ ట్రస్ట్’ను ప్రారంభించాడు. అక్కడి అందాలను కెమెరాల్లో బంధించి, ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటీవల నగరంలోని లామకాన్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉద్దేశం ఆయన మాట ల్లోనే...

 

‘చుట్టూ ప్రకృతి సోయగం ఎంత ఉన్నా ఆ ఊరును ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం ప్రచారం లేకపోవడమే. ప్రభుత్వం, ప్రైవే టు సంస్థలు కలాప్‌ను సందర్శించిన దాఖలాల్లేవు. నేను 2013లో ఆ ఊరికి వెళ్లాను. గొర్రెలు, మేకల పెంపకం తప్ప ఆ గ్రామానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కలాప్ ప్రజల భాష కూడా మౌఖికమే తప్ప లిఖిత పూర్వకమైనది కాదు. స్వతహాగా ఫోటోగ్రాఫర్‌నైన నేను అక్కడి ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యాను.

 

అప్పుడే ఫొటోల ద్వారా ఆ ఊరికి ప్రచారం కల్పించాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం అక్కడి అందమైన లొకేషన్లను ఫొటోల్లో బంధించి వాటిని కలాప్ ట్రస్ట్ దార్వా విక్రయించి, వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నా. అక్కడి ఇళ్లు చూస్తే అక్కడి ఆర్కిటెక్చర్ ఎంత సంపన్నమైనదో తెలుస్తుంది. అందుకే వారికి ఇతర చేతి వృత్తులను నేర్పిస్తున్నాను. 2014 అక్టోబర్‌లో అక్కడ తొలిసారిగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం.



ఎక్కువమంది విటమిన్ బీ12 లోపం, ఎనీమియాతో బాధపడుతున్నారు. కలాప్ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా... నా ఫొటోల ప్రచారంతో ఆ ఊరికి యాత్రికులు, పర్వతారోహకులు కచ్చితంగా వస్తారు. టూరిజం అభివృద్ధి అవుతుంది. అందమైన ప్రకృతికి నిలయమైన కలాప్‌లో షూటింగ్ స్పాట్స్‌కి కొదవ లేదు. సినిమా వాళ్లు కూడా రావడం వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అనుకుంటున్నా’.

 

ట్రెక్కింగ్‌కి అనుకూలం...

శీతాకాలంలో 3 నుంచి ఐదడుగుల మేర మంచుతో కప్పి ఉండే కలాప్ డెహ్రడూన్‌కి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిల్లీకి 450 కిలోమీటర్ల దూరం. కలాప్ సమీపంలోని నెట్వార్‌కి కారులో వెళ్లడానికి 6 గంటలు, బస్సులోనైతే పది గంటలు పడుతుంది. ట్రెక్కింగ్‌కి రెండు మార్గాలున్నాయి. వేసవి కాలం మార్గంలో 8 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు పడుతుంది. శీతాకాలం మార్గంలో 5 కిలోమీటర్లు నడిచేందుకు 4 గంటల సమయం పడుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top