నగరమే ఓ చిత్రం

నగరమే   ఓ చిత్రం - Sakshi


గొప్ప చారిత్రక నేపథ్యం, గల్లీకో సామాజిక వైవిధ్యం.. కనుమరుగు కాని సంప్రదాయం, కనువిందు చేసే ఆధునికం.. ఇంత కన్నా ఆసక్తికరమైన థీమ్ ఏముంటుంది.. ఒక కుంచె కదలడానికి? ఒక వర్ణం కాంతులీనడానికి! నగర యువతి మందాకినీ రావుకు చిత్రాలు గీయడమంటే ఇష్టం. సిటీ అంటే ప్రాణం. ఇప్పుడామె తన ప్రాణప్రదమైన నగరాన్నే తన ఇష్టానికి ఆలంబనగా చేసుకున్నారు. ప్రైవేటు ఉద్యోగిని నుంచి పూర్తిస్థాయి చిత్రకారిణిగా రూపుదిద్దుకుంటూ తన తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు థీమ్‌గా హైదరాబాద్‌ని ఎంచుకున్నారు. ఈ నెల 31న మారియట్ హోటల్‌లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ‘హైదరాబాద్ త్రూ ఆర్ట్’ని మనకు చూపనున్నారు.  తనకు తెల్సి ఈ తరహాలో ఒక నగరం గురించి  పూర్తిస్థాయి చిత్రాలను ఎవరూ ఆవిష్కరించింది లేదంటున్నారామె. ఈ సందర్భంగా ఈ యువ చిత్రకారిణి ‘సిటీప్లస్’తో పంచుకున్న భావాలు ఆమె మాటల్లోనే..      -  ఎస్.సత్యబాబు

 

హార్ట్ నుంచి పుట్టిన ఆర్ట్



డిగ్రీ పూర్తయ్యాక గ్రాఫిక్ డిజైనర్‌గా మంచి జీతం ఇచ్చే రెండు ఉద్యోగాలు మానసిక ఆనందానికి సంపూర్ణత ఇవ్వలేకపోయాయి. అందుకే చిన్ననాటి నుంచి నా హృదయానికి తోడుగా ఉన్న రంగుల ప్రపంచానికే దగ్గరయ్యా. హార్ట్‌లో పుట్టిన ఆర్ట్‌కు ఓటేస్తూ ఆర్ట్-48 పేరుతో నేను అప్పటిదాకా గీసిన చిత్రాలు, నా కలెక్షన్స్ కలిపి ఒక షో నిర్వహించా. దానికి వచ్చిన స్పందనతో పూర్తిస్థాయి ఆర్టిస్ట్‌గా నా సోలో ప్రదర్శన నిర్వహించాలని అనుకున్నా.



నగరాన్ని మించిన ‘చిత్రం’ ఏముంది?



సిటీలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం, టీనేజ్ అంతా ఇక్కడే గడిచింది. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి, మహేంద్రహిల్స్‌లో నివసించాం.  ఊహ తెల్సిన దగ్గర్నుంచీ నగరంలోనే ఆటలూ, పాటలూ, చదువూ, ఉద్యోగమూ.. అన్నీ! అందుకే నా తొలి ‘షో’ థీమ్‌గా నగరాన్నే ఎంచుకున్నాను. అందరికీ తెల్సిన అద్భుతాలతో పాటు తక్కువ మందికి మాత్రమే పరిచయమున్న విశేషాలను కూడా చిత్రాలుగా మలిచాను. మొత్తం 30 చిత్రాలు నా ప్రదర్శనలో ఉంటాయి. చాలా మందికి తెలిసిన చారిత్రక చార్మినార్ నుంచి, తక్కువ మందికే తెలిసిన సీతారాంభాగ్‌లోని 180 ఏళ్ల సీతారామ్ టెంపుల్ దాకా ఇందులో ఉంటాయి.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top