అప్పనంగా.. అప్పగింత!

అప్పనంగా.. అప్పగింత! - Sakshi


కాంట్రాక్టర్లకు బిల్లులపై 5 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు

కట్టిన జీఎస్టీలో 90 శాతం మొత్తాన్ని ఐటీసీ ద్వారానే పొందుతున్న కాంట్రాక్టర్లు

తాజా 5 శాతం అదనపు చెల్లింపులతో వారికి భారీగా లబ్ధి

ఏటా రూ.వందల కోట్ల భారం పడే అవకాశం




సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బడా కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు జీఎస్టీ కారణంగా ఆర్థిక వెసులుబాటు ఉండదేమో అనే ఆలోచన, పనులు ఆగిపోతాయేమో అనే ఆదుర్దాతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి అదనపు రాబడిని సమకూరుస్తున్నాయి.



ఈ కోవలోనే కాంట్రాక్టు పనులు చేసే ఏజెన్సీలకు బిల్లులపై 5 శాతం అదనంగా చెల్లించాలని ఈనెల 8న ప్రభు త్వం ఇచ్చిన ఉత్తర్వులు అటు సాగునీటి శాఖలో నూ, ఇటు వాణిజ్య పన్నుల శాఖలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం ఈ ఉత్తర్వుల కారణంగా ఏటా అదనంగా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల పేరిట రూ. 380 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది.



5 శాతం అదనపు చెల్లింపులు ఎందుకు?

జీఎస్టీ కింద కట్టిన పన్నులో దాదాపు 90 శాతం ఐటీసీ, టీడీఎస్‌ల కింద సదరు కాంట్రాక్టు ఏజెన్సీలకు జమవుతుంటే అదనంగా వారికి 5 శాతం ఎందుకు చెల్లించాలో అర్థం కాని పరిస్థితి. ఈ లెక్కన 5 శాతం చెల్లిస్తే రూ.100 కోట్ల పనులకు రూ.5 కోట్లు బిల్లులివ్వాలి. అంటే జీఎస్టీ కింద కట్టాల్సిన రూ.1.84 కోట్లు పోను మరో 3.16 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారన్న మాట. ప్రతి రూ.100 కోట్ల పనులకు రూ.3.16 కోట్లు అదనంగా చెల్లిస్తే, రూ.1,000 కోట్లకు అది రూ.31.6 కోట్లు అవుతుంది. గతంలో ఉన్న 5 శాతం అదనపు చెల్లింపులను కూడా లెక్కకడితే మరో రూ.5 కోట్లు కలుపుకోవాల్సి ఉంటుంది.



ఆ ప్రకారం రూ.100 కోట్లకు 8.16 కోట్లు, రూ.1,000 కోట్ల పనులకు రూ.81.6 కోట్లు అవుతుంది. ప్రతి ఏడాదిలో నెలకు రూ.1,000 కోట్ల చొప్పున సాగు నీటి బిల్లులు చెల్లిస్తారనే అంచనా మేరకు ఏటా ఈ భారం రూ.900 కోట్లు దాటనుంది. ఒక అదనపు చెల్లింపు కోసం గతంలోనే ఉత్తర్వులున్న నేపథ్యంలో తాజాగా ఇచ్చిన 5 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకున్నా రూ.1,000 కోట్లకు రూ.31.6 కోట్ల చొప్పున ఏడాదికి ఈ భారం రూ.379 కోట్లు. కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాన్ని నిజంగా చివర్లో రికవరీ చేసినా ఎప్పటికప్పుడు అదనంగా చెల్లించే ప్రజాధనాన్ని సదరు కాంట్రాక్టర్లు అప్పనంగా వాడేసుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు.



దీనికి మాత్రం ప్రభు త్వం వద్ద సమాధానం లేదు. జీఎస్టీ 12 శాతం విధింపు నేపథ్యంలో మెటీరియల్‌ కొనుగోలుకు చెల్లించే పన్ను కాంట్రాక్టు ఏజెన్సీలకు నిజంగా భారమైతే అదనపు చెల్లింపులు చేసినా నష్టం లేదని నిపుణులంటున్నారు. కానీ జీఎస్టీ నిబంధనల ప్రకారం ప్రస్తుత నెలలో కొనుగోలు చేసిన మెటీరియల్‌కు వచ్చే నెల 20లోపు ఐటీసీ రిటర్న్స్‌∙సమర్పిస్తే, వారు సమర్పించిన మరుక్షణమే ఆన్‌లైన్‌ ద్వారా సదరు క్రెడిట్‌ ఏజెన్సీల ఖాతాలో చేరిపోతుంది. మరి అలాంటప్పుడు అదనపు చెల్లింపులు ఎందుకునేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.



కట్టేది తక్కువ, తీసుకునేది ఎక్కువ

కాంట్రాక్టు పనులపై జీఎస్టీని 12 శాతంగా కేంద్రం నిర్ణయించింది. అంటే రూ.100 కోట్ల కాంట్రాక్టు పనుల కు రూ.12 కోట్లను ప్రభుత్వానికి సదరు కాంట్రాక్టు ఏజెన్సీ పన్ను కింద కట్టాల్సి ఉంటుంది. జీఎస్టీ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పనుల్లో వాడే మెటీరియల్‌ కింద కట్టిన పన్నును ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) ద్వారా కాంట్రాక్టు ఏజెన్సీ తిరిగి పొందవచ్చు. సదరు మెటీరియల్‌ కాంట్రాక్టర్‌కు చేరకముందే ఆ మెటీరియల్‌కు విధించిన పన్నును తయారీదారుడు చెల్లిస్తాడు కాబట్టి ఈ వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారం మొత్తం రూ.100 కోట్ల పనుల్లో రూ.60 కోట్ల విలువైన మెటీరియల్‌కు ఐటీసీ తీసుకోవ చ్చు. దేశంలోని ఏ రాష్ట్రం నుంచి మెటీరియల్‌ను కొనుగోలు చేసినా ఐటీసీ లభిస్తుంది.



మెటీరియల్‌ ఉపయోగించే 60 శాతం విలువైన పనుల్లో సిమెం ట్‌ 25 శాతం వినియోగిస్తే దీని జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం రూ.4.2 కోట్లు, మరో 20 శాతం ఐరన్‌ను వినియోగిస్తే దీని జీఎస్టీ రేటు ప్రకారం రూ.2.16 కోట్లు ఐటీసీ కింద వస్తుంది. ఇతర మెటీరియల్‌కి సరాసరి 12 శాతం జీఎస్టీ రేటు కట్టిచ్చినా రూ.1.8 కోట్లు ఐటీసీ కింద వస్తుంది. మొత్తం 60 శాతం మెటీరియల్‌కు రూ.8.16 కోట్ల ఐటీసీ వస్తుంది. టీడీఎస్‌ కింద ప్రభుత్వం అగ్రిమెంట్‌ సమయంలోనే ఏజెన్సీ మినహాయించుకునే 2 శాతం కూడా ఉంది. టీడీఎస్‌ను మళ్లీ కాం ట్రాక్టర్‌ ఫారం–16 ద్వారా ఆదాయపు పన్ను శాఖ నుంచి పొందే అవకాశముంది. దీంతో మొత్తం రూ.12 కోట్ల పన్ను నుంచి రూ.10.16 కోట్లు మిన హాయిస్తే మిగిలేది రూ.1.84 కోట్లు మాత్రమే.



ఓ వైపు పోరాటం.. మరోవైపు ఉబలాటం

వాస్తవానికి జీఎస్టీ కారణంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రూ.18,900 కోట్ల మేర భారం పడుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్, ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై 18 శాతం జీఎస్టీని వ్యతిరేకించడంతో జీఎస్టీ కౌన్సిల్‌ దాన్ని 12 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపుతో రూ.6,800 కోట్ల మేర ఉపశమనం కలుగుతుందనే లెక్కలు కూడా కట్టింది. మిగిలిన భారాన్ని తగ్గించుకునేందుకు గాను వచ్చే నెల 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలనే ప్రధాన ప్రతిపాదన చేయాలని నిర్ణయించింది.



అభివృద్ధి పనులపై జీఎస్టీ తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ అన్ని కోణాల్లో ఆమోదయోగ్యమే అయినా అనాలోచితంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడమే అభ్యంతరకరమనే వాదన వినిపిస్తోంది. అయితే కాంట్రాక్టర్ల ఎత్తులు, ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగానే ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలు జరిగాయనే విమర్శలు బహిరంగంగానే వస్తున్నాయి. ఈనెల 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో తాజా నష్టాన్ని సరిచేసే ఎలాంటి క్లాజు లేకపోగా, 8న ఇచ్చిన ఉత్తర్వుల్లో మాత్రం ఒకవేళ జీఎస్టీ కింద చెల్లించిన పన్ను కన్నా 5 శాతం అదనపు చెల్లింపులు ఎక్కువ అయినా చెల్లించాలని, తర్వాత రికవరీ చేయాలనే క్లాజ్‌ను చేర్చడం కొసమెరుపు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top