మొదటి అడుగు మహబూబ్‌నగర్‌లో..

మొదటి అడుగు మహబూబ్‌నగర్‌లో.. - Sakshi


పౌరసరఫరాల శాఖలో ఈ– పాస్‌ షురూ

- ఈ–పాస్‌తో రేషన్‌ అక్రమాలకు కళ్లెం

- మూడు దశల్లో రాష్ట్రం అంతటా అమలు

- బిజినెస్‌ కరస్పాండెంట్లుగా రేషన్‌ డీలర్లు: కమిషనర్‌ సి.వి.ఆనంద్‌




సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో రేషన్‌ అక్రమాలకు చెక్‌ పెట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నడుం బిగించింది. రేషన్‌ దుకాణాలను నగదురహిత కార్యకలాపాలకు వేదికగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దశల వారీగా ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ–పాస్‌ ) విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో మొదటి దశలో పది జిల్లాల్లో 5,242 షాపుల్లో, రెండో దశలో 11 జిల్లాల్లో 4,817 షాపులు, మూడో దశలో తొమ్మిది జిల్లాల్లో 5,507 షాపుల్లో మొత్తంగా మూడు దశల్లో 15,606 రేషన్‌ దుకాణాల్లో ఈ పాస్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.



ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలి అడుగులు పడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలో 6 రేషన్‌ షాపులు, జడ్చర్ల మండలంలో 20 షాపులు, మహబూబ్‌నగర్‌ మండలంలో 14 షాపులు, మొత్తంగా 40 షాపుల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. పైలెట్‌ ప్రాజెక్టుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గత ఏడాది మార్చి నుంచి ఈ–పాస్‌ విధానం అమలవుతోంది. ఇక్కడ ఈ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత ఈ ఏడాది మార్చి నెల వరకు రూ.269కోట్ల మేర ఆదా అయ్యింది. దీంతో ఈ–పాస్‌ విధానంతో రేషన్‌ అక్రమాలకు పక్కాగా కళ్లెం వేయొచ్చని నిర్ణయానికి వచ్చారు.



పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ–పాస్‌ యంత్రాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ–పాస్‌ యంత్రాల్లో గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఈ –పాస్‌ విధానం అమలవుతున్న హైదరాబాద్‌ రేషన్‌ షాపుల్లోని ఈ యంత్రాల్లో కేవలం వేలిముద్రల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, నగదు రహిత లావాదేవీలకు వీలుగా యంత్రాల్లో మార్పులు చేశారు. ఈ–పాస్‌కు అదనంగా ఐరిస్‌ స్కానర్, బరువులు తూచే ఎలక్ట్రానిక్‌ తూకం, స్వైపింగ్, ఆధార్‌ ద్వారా చెల్లింపులు (ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టం /ఏఈపీఎస్‌), ఆడియో వాయిస్‌ వంటి అంశాలను పొందుపరిచారు. వివిధ రకాల చెల్లింపులు చేపట్టేలా యంత్రాలను రూపొందించారు. నిత్యావసర సరుకులకు చెల్లింపులకింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు తీసుకునేందుకు వీలుగా యంత్రాల్లో స్టాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచారు.



చౌకధరల దుకాణాల్లో మైక్రో ఏటీఎంలు..

చౌకధరల దుకాణాల ద్వారా బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగణంగా మైక్రో ఏటీఎంలను అమరుస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ తెలిపారు. సరుకుల పంపిణీతో పాటు బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిర్వహణకు చౌకధరల దుకాణదారుడిని బిజినెస్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరించనున్నామన్నారు. కొంత మందిలో వేలిముద్రలు అరిగిపోవడం తదితర కారణాలతో బయోమెట్రిక్‌ విధానంలో సమస్యలు వస్తున్న కారణంగా, దీనిని అధిగమించడానికి నూతంగా ఐరిస్‌ను, గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టకుని వాయిస్‌ ఓవర్‌ విధానం తెచ్చామన్నారు. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి గ్రామంలోని రేషన్‌ షాపులో ప్రయోగాత్మకంగా ఈ–పాస్‌ యంత్రాన్ని కమిషనర్‌ ఆనంద్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top