చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ!

చర్చను ఎగ్గొట్టే ఎత్తుగడ! - Sakshi


ఏపీ రాజధాని ప్రకటన వాయిదా వెనుక మతలబిదే...



సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై మంగళవారం శాసన సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారంటూ మీడియాకు లీకులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, అంతలోనే అకస్మాత్తుగా దాన్ని వాయిదా వేసుకోవడం సర్వత్రా చర్చనీయంగా మారింది. శాసనసభ ప్రస్తుత సమావేశాలు ఈ నెల 6వ తేదీతో ముగుస్తున్నందున రాజధాని అంశం సభలో ఎక్కువ సమయం పాటు చర్చకు రాకుండా సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తన ప్రకటనను వాయిదా వేసినట్టు చెప్తున్నారు.

 

మంగళవారం ప్రకటన చేయాలని బాబు ముందుగా అనుకున్నప్పటికీ, ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే... రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై చర్చ కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దానిపై సభలో సమగ్ర చర్చ జరగాలని పార్టీ పట్టుబట్టింది. దాంతో అప్పటికప్పుడు బాబు ప్రకటనను వాయిదా వేసుకున్నారు. కమిటీ సిఫారసులు, నివేదికల వంటి ఏ ప్రాతిపదిక లేకుండా ఏకపక్షంగా రాజధానిపై ఎలా నిర్ణయానికి వస్తారని విపక్షం ప్రశ్నిస్తే ఇబ్బందుల్లో పడతామనే భావనతోనే ఇలా చేశారంటున్నారు. సుదీర్ఘ చర్చకు ఆస్కారం లేకుండా, అసెంబ్లీ సమావేశాల ముగింపు గడువు సమీపిస్తుండగా దాన్ని చర్చకు చేపట్టి సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న ఆలోచనతోనే ఇలా చేశారంటున్నారు.

 

బయటికి మాత్రం... మంగళవారం ముహూర్తం సరిగా లేదన్న సాకు చూపారు. అసెంబ్లీ లాబీల్లో దానికి విస్తృత ప్రచారం కల్పించారు. మంగళవారం అష్టమి మంచిది కాదు కాబట్టే రాజధానిపై ప్రకటనను బాబు వాయిదా వేసుకున్నారని మంత్రులు కూడా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. గురువారం దశమి గనుక ఆ రోజు ప్రకటన చేస్తారంటూ లీకులిచ్చారు. అంతేగాక... శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్రం ఎక్కడ ఆమోదిస్తుందోననే ఆందోళనతో, అలా జరగడానికి ముందుగానే రాజధానిపై ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆ కమిటీ సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టి ‘విజయవాడ-గుంటూరు’ మధ్యలోనే రాజధాని అంటూ ప్రకటన చేయాలని సోమవారం నాటి మంత్రివర్గ భేటీలో నిర్ణయానికి రావడం తెలిసిందే.

 

సన్నిహితులకు లాభం చేకూర్చేలా...

రాజధానిపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తీరుపై అధికార టీడీపీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాంటిది, ఇప్పుడాయన ఏకంగా రాజధానిపై ప్రకటనే చేయడానికి సిద్ధపడటంతో ఆ అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమనే స్థాయికి చేరింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా, తానే వేసిన మంత్రి నారాయణ కమిటీ నివేదిక ఇవ్వకముందే బాబు ఇలా ఇష్టానికి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేమిటని టీడీపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నేతలు భగ్గమంటున్నారు.

 

రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలోనేనంటూ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే అనేకసార్లు బహిరంగ ప్రకటనలు చేయడం, ఆ జిల్లాల మంత్రులు, తదితరులతో పదేపదే ప్రకటనలు చేయించడం తెలిసిందే. దీనిపై ఇతర జిల్లాల్లో తీవ్ర విమర్శలు రేగడంతో తాను మాట్లాడకుండా మంత్రులతో కథ నడిపిస్తున్నారని ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టే తిప్పుతూ తన సన్నిహితులకు, టీడీపీ ముఖ్యులకు, కొందరు బడా రియల్టీ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా బాబు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఏకపక్ష నిర్ణయంతో ఇబ్బందులే

రాజధాని ప్రాంతం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపట్ల సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, నేతలు, ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏకపక్షం నిర్ణయమెలా తీసుకుంటారంటూ వారి నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అది తొందరపాటే అవుతుందని మంత్రులు కూడా అభ్యం తరం వ్యక్తంచేశారని సమాచారం. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులపై ఆధారపడాల్సిన తరుణంలో కేంద్రంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తే మున్ముందు ఇబ్బందులు తప్పవని మంత్రులు అంగీకరిస్తున్నారు. ‘పైగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి, బాబే వేసిన నారాయణ కమిటీ కసరత్తయినా పూర్తవకుండానే... రాజధాని ఫలానా చోటేనంటూ ఏ ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడిక ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టే’ అని సీనియర్ మంత్రి ఒకరన్నారు.

 

ఆ జిల్లాల నేతల పెత్తనమేంటి?

కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల పెత్తనంలోనే రాజధాని ఆలోచనలు సాగడమేమిటని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి ఒకరు మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ప్రశ్నించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడం వెనక మతలబేమిటంటూ ఘాటుగా విమర్శించారు. దీన్ని అసెంబ్లీలోనే ప్రస్తావిస్తానని చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా బాబు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా నేతలూ బాబును తప్పుబడుతున్నారు.

 

రాజధాని ముసుగులో బాబు తన సొంత మనుషులకు లాభం చేకూర్చే వ్యూహంలో ఉన్నారని, వారంతా ఇప్పటికే రైతుల నుంచి వేలాది ఎకరాలను రిజిస్ట్రేషన్లు లేకుండా ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని కొందరు టీడీపీ నేతలే గుర్తు చేస్తున్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా రాజధాని తమకు అనుకూలమైన ప్రాంతంలోనే వచ్చేట్టుగా చూసుకునేందుకు ఆ రెండు జిల్లాల నేతలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండటమూ మరో వివాదానికి దారితీస్తోంది.

 

విజయవాడ నుంచి గుంటూరు వైపు రాజధాని ఉండాలని గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుబడుతున్నారు. ‘‘మంగళగిరి వద్ద భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగాఉన్నారు. రాజధానికి ఎన్టీరామారావు పేరు పెడితే మా జిల్లా రైతులు 8 వేల ఎకరాలిచ్చేందుకు సిద్ధం’’ అని ఆయన మంగళవారం అన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమ రాజధాని తమ ప్రాంతం వైపే ఉండాలని పట్టుబడుతున్నారు.

 

భగ్గుమంటున్న కేఈ


రాజధాని భూసేకరణ కమిటీలో ఉండేందుకు ససేమిరా



రాజధాని భూ సేకరణకు సీఎం చంద్రబాబు నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యునిగా ఉండేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిరాకరించారు. సోమవారం జరిగిన మంత్రిమండలి భేటీలో ఈ ఉపసంఘాన్ని నియమించడం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కేఈని కూడా సభ్యుడిగా ఉండాలని బాబు సూచిం చగా ఆయన నిరాకరించారు. రాజధాని ప్రాంతం ఎంపిక తీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 

పైగా గతంలో మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని నిర్మాణ సలహా కమిటీ వేసినప్పుడు తనను విస్మరించడం కూడా ఇందుకు కారణమేనంటున్నారు. ఇప్పటికే ఒకసారి రాజధానిని కోల్పోయిన రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా అలాంటి కమిటీలో ఉంటే తన ప్రాంత ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొనాల్సి ఉంటుం దని కూడా కేఈ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే, సీమ నేతగా మరో చోట రాజధాని ఏర్పాటుకు భూమిని సేకరించే ప్రయత్నాల్లో భాగస్వామిని కాలేనని కేఈ తేల్చిచెప్పినట్టు సమాచారం. దాంతో కేఈ స్థానంలో అచ్చెన్నాయుడుకు కమిటీలో స్థానం కల్పించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top