పీజీ వైద్య విద్య ఫీజుల మోత

పీజీ వైద్య విద్య ఫీజుల మోత


ప్రైవేటు కాలేజీల్లో 10 శాతం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

♦ కన్వీనర్ కోటా క్లినికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులకు రూ.2.90 లక్షల నుంచి రూ.3.20 లక్షలకు పెంపు

♦ ఇవే కోర్సులకు యాజమాన్య కోటాలో రూ.5.25 లక్షల నుంచి రూ.5.80 లక్షలకు..

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పీజీ వైద్య విద్య ఫీజుల మోత మోగింది. ప్రైవేటు మెడికల్ కళశాలల్లోని కన్వీనర్ (ఏ కేటగిరీ), యాజమాన్య కోటా (బీ కేటగిరీ)సీట్ల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం తీసుకుంది. పీజీ వైద్య విద్య పరిధిలోని మొత్తం 7 కోర్సులు ఫీజులూ పెంచారు. కన్వీనర్ కోటాలో క్లినికల్ డిగ్రీ, క్లినికల్ డిప్లొమా కోర్సులకు ప్రస్తుతం రూ. 2.90 లక్షల చొప్పున ఫీజు ఉండగా.. వాటిని రూ.3.20లక్షలకు పెంచారు. ఇవే కోర్సులకు మేనేజ్‌మెంట్ కోటాలో రూ.5.25లక్షల నుంచి రూ.5.80లక్షలకు పెంచారు. ఇక సూపర్ స్పెషాలిటీ సీట్లకూ 10 శాతం చొప్పున పెంచారు. దీంతో ఈ సీట్ల ఫీజు కన్వీనర్ కోటాలో రూ.4.08 లక్షలకు, యాజమాన్య కోటాలో రూ.8.26లక్షలకు చేరింది.



 8 కాలేజీలు.. 572 సీట్లు

 రాష్ట్రంలో పీజీ వైద్య విద్య అందించే ప్రైవేటు కాలేజీలు ఎనిమిది ఉన్నాయి. వాటిలో మొత్తం 572 సీట్లున్నాయి. వీటిలో సగం (286) సీట్లు ఏ కేటగిరీ కోటాలో ఉన్నాయి. అంటే వాటిని కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగతా సగం (286) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. ఇటీవలే పీజీ వైద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం.. ఈ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులకు ఈ నెల ఐదో తేదీ వరకు గడువిచ్చింది. అయితే ఆలోగానే ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఆగమేఘాల మీద ఫీజులు పెంచారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి భారీగా ఫీజులు పెంచాలని ప్రైవేటు కాలేజీలు డిమాండ్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిమాండ్ ఉన్న ఒక్కో మెడికల్ పీజీ సీటును రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ప్రైవేటు యాజమాన్యాలు అమ్మేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.



 ఎంబీబీఎస్ ఫీజులు కూడా..!

 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు కూడా ఫీజులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.9 లక్షలుండగా... ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా రూ.11.5లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీ కేటగిరీ (ఎన్నారై కోటా) సీట్ల ఫీజు తెలంగాణలో ప్రస్తుతం రూ.11 లక్షలుగా ఉంది. అదే ఏపీలో ఈ కోటా ఫీజును యాజమాన్య కోటా ఫీజుకు ఐదు రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటుంది. అదే తరహాలో రాష్ట్రంలోనూ పెంచాలని భావిస్తున్నారు. అంటే ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.55లక్షల వరకు చేరే అవకాశముంది. అయితే ఎంబీబీఎస్ ప్రవేశపరీక్షకు, కౌన్సెలింగ్‌కు ఇంకా సమయమున్నందున ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోబోమని... అయితే ఫీజుల పెంపు మాత్రం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top