అర్ధరాత్రి కారు బీభత్సం...

అర్ధరాత్రి  కారు బీభత్సం... - Sakshi


* రెండు బైక్‌లను ఢీకొట్టిన కారు

* ఒకరి మృతి...మరో ఇద్దరికి గాయాలు

* మద్యం మత్తులో కారును నడపడంతోనే ప్రమాదం

* కారు స్వాధీనం: నిందితుల కోసం ఆరా


బంజారాహిల్స్: వారి జల్సా... నిండు ప్రాణాన్ని బలిగొంది... తప్పతాగి కారును నడిపి బీభత్సం సృష్టించారు... కారును నియంత్రించలేక రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు.... ఒకరి ప్రాణం తీశారు. మరో ఇద్దరిని తీవ్రగాయాలపాల్జేశారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే కారును వదిలి ఆటోలో పారిపోయారు.  బంజారాహిల్స్ ఠాణా పరిధిలో రోడ్ నంబర్ 2లోని ముఫకంజా కళాశాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

 

పోలీసుల కథనం ప్రకారం... బోయినపల్లిలోని ఫిరోజ్‌నగర్‌కు చెందిన మొఘల్‌షా షావలి (29) కూకట్‌పల్లిలోని స్పార్కు సూపర్‌మార్కెట్‌లో మెయింటెనెన్స్ ఇన్‌చార్జి.  రోజు మాదిరిగానే శనివారం అర్ధరాత్రి బైక్( ఏపీ 10ఏఆర్ 2518 )పై తన స్నేహితుడు అమర్‌సింగ్ మాలిక్‌తో కలిసి ఇంటికి బయలు దేరాడు. రాత్రి 12.30కి బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వైపు నుంచి పంజగుట్టవైపు అతివేగంగా వెళ్తున్న ఆడి కారు (ఏపీ 10 బీఎఫ్ 4800) ముఫకంజా కళాశాల వద్ద అదుపు తప్పి  షావలీ బైక్‌ను ఢీకొట్టింది. అతని ముందు మరో బైక్‌పై వెళ్తున్న రవీందర్‌ను కూడా ఢీకొట్టి ఆగిపోయింది.



ఈ ప్రమాదంలో షావలీకి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  మాలిక్, రవీందర్‌లు గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొనేలోపే కారులో ఉన్న ముగ్గురు యువకులు, యువతి కారు దిగి ఆటోలో పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షావలీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి, గాయపడ్డ మాలిక్, రవీందర్‌ను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు.

 

కారును నడిపింది ఎవరు....

కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది మగ్దూమ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందినదని తేల్చారు.  జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో అర్ధరాత్రి దాకా మద్యం తాగి కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు  పోలీసుల దర్యాప్తులో తేలింది. కారులో ఉన్నవారంతా పీకలదాకా మద్యం తాగి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా పోలీసులకు తెలిపారు. అయితే కారులో ఉన్న ముగ్గురు యువకులు, యువతి ఎవరు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



ఆదివారం సెలవు కావడంతో సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయంలో ఎవరు అందుబాటులో లేరని, నిందితులను సోమవారం గుర్తిస్తామని పోలీసులు చెప్తున్నారు.  నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని వారు ‘సాక్షి’కి తెలిపారు.  ముఫకంజా కళాశాల సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు, నిందితులు కారు వదిలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యే అవకాశం ఉందని పోలీసులంటున్నారు. ఆ ఇంటి  యజమాని అందుబాటులో లేకపోవడంతో ఆయనను రప్పించే పనిలో పడ్డారు.   

 

ఫిరోజ్‌నగర్‌లో విషాదఛాయలు....

విధులకు వెళ్లిన షావలీ ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న అతని భార్య ఈ విషాద వార్త విని సొమ్మసిల్లిపోయింది. ఆమె ప్రస్తుతం గర్భవతి. వీరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. విషయం తెలియగానే బంధువులు, స్నేహితులు, సూపర్‌మార్కెట్ ఉద్యోగులు బోయిన్‌పల్లి ఫిరోజ్‌నగర్‌లోని షావలీ ఇంటికి చేరుకున్నారు.  బస్తీవాసులందరితో షావలీ కలిసిమెలిసి ఉండేవాడని, అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.  షావలీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top