ప్రశ్నలతో పాటు జవాబులూ..!

ప్రశ్నలతో పాటు జవాబులూ..!

  •  జేఎన్టీయూహెచ్‌లో రిక్రూట్‌మెంట్ ‘రగడ’

  •  పరిపాలనా భవనం వద్ద అభ్యర్థుల ఆందోళన

  •  పరీక్ష ఈ నెల 26కు వాయిదా: రిజిస్ట్రార్

  •  సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్‌లో నిర్వహిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకపు ప్రక్రియ అధికారుల డొల్లతనాన్ని వెల్లడించింది. ఈ నెల 15 నుంచి నిర్వహిస్తున్న పరీక్షల్లో లొసుగులు బయటపడుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు డెరైక్టర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. బుధవారం నిర్వహించిన మెథమేటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ అస్తవ్యస్తంగా ఉండడంతో అభ్యర్థులు పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. నియామకపు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

     

     ప్రశ్నపత్రంతో జవాబులు..  

    అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న లెక్కల పరీక్షలో ప్రశ్నపత్రంతో పాటు జవాబులూ ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను టిక్ చేసి పెట్టారు. ప్రశ్నపత్రం అందుకున్న అభ్యర్థులు జవాబులు కూడా టిక్ చేసి ఉండడంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు తెలియజేశారు. 60 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నపత్రంలో 57 ప్రశ్నలకు సరైన సమాధానాలు పెన్సిల్‌తో చిన్నగా మార్క్ చేసి ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. కీలకమైన పరీక్షలకు చేతితో రాసిన ప్రశ్నపత్రాలు ఇవ్వడం.. అందులో సమాధానాలను పెన్సిల్‌తో టిక్ చేసి ఉండడంతో ఎవరికోమేలు చేసేందుకే ఇలా చేశారని.. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటినీ రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై జేఎన్టీటీయూహెచ్ ఉపకులపతి రామేశ్వర్‌రావు స్పందిస్తూ... మానవ తప్పిదం వల్లే పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరు కావాల్సిందిగా అభ్యర్థులను కోరారు. కాగా,  నియామక ప్రక్రియలో అవకతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు అభ్యర్థులు వెళ్లారు.

     

     పరీక్ష 26కు వాయిదా: రిజిస్ట్రార్


     బుధవారం మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో జవాబులు మార్క్ చేసి ఉన్నట్లు పరీక్ష ప్రారంభ మైన కొద్దిసేపటికే గుర్తించామని, ఆ ప్రశ్నాపత్రాలను వెనక్కి తెప్పించామని రిజిస్ట్రార్ రమణరావు చెప్పారు. రద్దయిన పరీక్షను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top