డిసెంబర్‌లోగా భూసేకరణ


మెట్రో కోసం చురుగ్గా ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్


 

సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయిన వారికి చెక్కుల పంపిణీ, కోర్టు వివాదాల్లోని వారితో సంప్రదింపుల వంటివి చేపడుతున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీలైనంత వరకు క్రిస్మస్‌లోగామెట్రో రైలు వర్గాలకు భూములు అప్పగించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టోలిచౌక్ ఫ్లైఓవర్‌ను సంక్రాంతిలోగా, కందికల్ గేట్ ఫ్లై ఓవర్‌ను డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లకు సంబంధించి ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, భవన యజమానులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తామన్నారు. ఇందుకుగాను సర్కిళ్ల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటికి భద్రత లేదనే పోస్టర్లను భవనాలకు అంటించడంతో పాటు వ్యాపారాలను సీజ్ చేస్తామని తెలి పారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు సైతం ఫైర్‌సేఫ్టీ తప్పనిసరి అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోనూ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేస్తామన్నారు.



ఆధునికంగా గృహ నిర్మాణం



టర్కీలోని ఇస్తాంబుల్ తరహాలో ఓ వైపు చరిత్ర, సంస్కృతిని కాపాడుతూనే...మరో వైపు ఆధునిక పద్ధతుల్లో గృహ నిర్మాణం వంటివిచేపడతామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐడీహెచ్ కాలనీని మోడల్‌గా డబుల్ బెడ్‌రూమ్స్‌తో నిర్మిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. కాంట్రాక్టర్ ఎంపిక పూర్తయిందన్నారు. త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు. కేంద్రం నూతన గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించాక మరిన్ని మోడల్ కాలనీలను నిర్మించనున్నట్లు తెలిపారు.

 

రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం



రోడ్ల మరమ్మతులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని కమిషనర్ చెప్పారు. గుంతలు పూ డ్చే రోడ్డు డాక్టర్ యంత్రానికి మరమ్మతుల వల్ల పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. రోడ్ల మరమ్మతులకు సర్కిల్ స్థాయిలోనే డీఎంసీలకు రూ.20 లక్షల వరకు నిధుల మం జూరు అధికారమిచ్చామని చెప్పారు. గుంతల పూడ్చివేతకు బేమీ రోలర్‌లను అందజేశామని తెలిపారు. బీటీ మిక్స్ ప్లాంట్‌నూ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో జీహెచ్‌ఎంసీతో పాటు ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్, కంటోన్మెంట్ విభాగాల రోడ్లున్నాయని, అన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చినప్పుడే నిర్వహణ మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.     

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top