‘మహా’ నష్టంపై ప్రజల్లోకి... : టీపీసీసీ

‘మహా’ నష్టంపై ప్రజల్లోకి... : టీపీసీసీ - Sakshi


టీపీసీసీ నిర్ణయం

* ముఖ్య నేతలు, సాగునీటిరంగ నిపుణులతో ఉత్తమ్ భేటీ

* సీఎం నిర్ణయంతో తెలంగాణకు శాశ్వత నష్టం: పొన్నాల

* కేంద్ర మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకొని ఉంటే మేలు జరిగేదని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, మహారాష్ట్ర ఒప్పందంతో జరిగే నష్టంపై ప్రజల్లోకి వెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. సాగునీటిరంగ నిపుణులు, ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో శుక్రవారం సమావేశం జరిగింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్ధన్, పలువురు రిటైర్డు ఇంజనీర్లు ఈ భేటీలో పాల్గొన్నారు.



తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే చర్చలు జరిగాయని, ఇందుకు సూత్రప్రాయమైన అంగీకారం కూడా వచ్చిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్యయ్య వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడానికి ఒప్పందం చేసుకుని వచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణకు శాశ్వతంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రం మధ్యవర్తిత్వంతో చర్చలు, ఒప్పం దాలు చేసుకుంటే తెలంగాణకు మేలు జరిగేదన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే ఒక్క మహారాష్ట్రతోనే ఒప్పందం సరిపోదన్నారు. ఛత్తీస్‌గఢ్, ఏపీతోనూ ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

 

కమీషన్లు దండుకునేందుకే...

పలువురు నిపుణులు, నాయకులు మాట్లాడుతూ.. రీడిజైనింగ్ పేరుతో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా జలాశయాలు నిర్మించి, అశాస్త్రీయంగా, సాంకేతిక లేమితో ప్రతిపాదనలను చేస్తున్నారన్నారు. దీని వల్ల ప్రాజెక్టుల నిర్మాణం, ముంపు, విద్యుత్, నిర్వహణ, దీర్ఘకాలిక సమస్యలు చాలా వస్తాయని హెచ్చరించారు. ప్రాణహిత వద్ద 120 రోజుల వరకు నీరు లభ్యమయ్యే అవకాశాలున్నాయని, పంట రోజులు కూడా 120 రోజులు ఉండటం వల్ల జలాశయాలు నిర్మించుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషించారు.



ప్రస్తుతం జరుగుతున్నదంతా రిజర్వాయర్ల నిర్మాణంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకోవడానికి చేస్తున్న కుట్ర మాత్రమేనని విమర్శించారు. వీటిని ప్రజలకు సమగ్రంగా వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పై ఉందన్నారు. ప్రాణహిత వద్దనే ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని, మేడిగడ్డ వద్ద చేపడితే ముంపు, నిర్వహణతోపాటు సహా చాలా నష్టాలుంటాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలు, ఒప్పందాల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇందులో జరుగుతున్న అవినీతి, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో నిజాలను ప్రజలకు అర్థమయ్యేలా మాధ్యమాలను ఎంచుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎంపీ పాల్వాయి, రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top