హైదరాబాద్‌లో ‘ఉగ్ర’కుట్ర

హైదరాబాద్‌లో ‘ఉగ్ర’కుట్ర


హైదరాబాద్‌లో విధ్వంసాలకు ఐఎస్ అనుబంధ సంస్థ ఏయూటీ పథకం

భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ

 ఐదుగురు అనుమానితుల అరెస్ట్.. అదుపులో మరో ఆరుగురు

నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, నగదు స్వాధీనం

నగరంలో ఐటీ కారిడార్లను టార్గెట్ చేసిన ముష్కరులు

విధ్వంసాలకు తోడు విచ్చలవిడిగా కాల్పులకు కుట్ర

దవా... ఇంజెక్షన్.. ట్యాబ్లెట్స్ పేర్లతో కోడ్ భాష


 

సాక్షి, హైదరాబాద్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విధ్వంసాలకు తెగబడేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. బుధవారం తెల్లవారుజామున పాతబస్తీలోని ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వారిని ఏయూటీ మాడ్యూల్‌కు సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌గా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతని సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ యాఖస్ ఇర్ఫాన్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసేర్ నైమతుల్లా, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, మహ్మద్ అతుల్లా రెహ్మాన్, అల్ జిలానీ  అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్, ఏఎం అజర్, మహ్మద్ అరబ్ అహ్మద్‌లుగా (అనుమానితుల్లో ఇద్దరు సోదరులతోపాటు మరో ఎనిమిది మంది బంధువులే) గుర్తించింది.

 

 వారంతా సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న పలు ప్రాంతాలతోపాటు కొందరు ప్రముఖులను లక్ష్యంగా చేసకున్నట్లు పేర్కొంది. జనసమ్మర్థ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడటంతోపాటు విచ్చలవిడిగా కాల్పులు జరపాలని పథక రచన చేసినట్లు వివరించింది. అనుమానితుల్లో ఐదుగురిని (ఇబ్రహీం, ఇలియాస్, హబీబ్, అబ్దుల్లా బిన్, హుస్సేన్) అరెస్టు చేశామని, మిగిలిన ఆరుగురిని ప్రశ్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిందితులపై హైదరాబాద్ ఎన్‌ఐఏ యూనిట్ ఆర్‌సీ-01/2016 నంబర్‌తో ఐపీసీ, ఎక్స్‌ప్లోజిక్స్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్‌లలోని వివిధ సెక్షన్లతోపాటు దేశద్రోహం ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


ఈ దాడుల్లో అధికారులు రెండు .9 ఎంఎం నాటు తుపాకులు, ఒక ఎయిర్‌గన్, రూ.15 లక్షల నగదు, యూరియా, కెమికల్స్, మూడు లీటర్ల పెయింట్స్, మేకులు, 40 సెల్‌ఫోన్లు, 32 సిమ్ కార్డులు, మూడు ల్యాప్‌టాప్స్, ఒక ట్యాబ్, సీపీయూ, ఏడు పెన్‌డ్రైవ్‌లు, వైఫై డాంగిల్, రెండు టార్గెట్ బోర్డులతో పాటు బాంబుల తయారీకి ఉపకరించే రెండు గ్యాస్‌స్టౌవ్‌లు, పెద్ద పాత్రలు, కండెన్సర్, హీట్ టైమర్, ప్రెషర్  మీటర్, రెండు గడియారాలు, రెండు జతల మాస్క్‌లు, గ్లౌజులు, నాలుగు విదేశీ తయారీ కత్తులు, పెద్ద స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు.

 

 ‘జునూద్’ మాడ్యుల్‌కు కొనసాగింపుగా

 కర్ణాటకలోని భత్కల్‌వాసి షఫీ ఆర్మర్ ఐసిస్‌కు అనుబంధంగా దేశంలో దాడుల కోసం ఏయూటీ (అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్)ని స్థాపించి సిరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి గతేడాది జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ (జేఏకే) మాడ్యుల్‌ను ఏర్పాటు చేశాడు. దీన్ని భగ్నం చేసిన ఎన్‌ఐఏ అధికారులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఏడు రాష్ట్రాలకు చెందిన 16 మందిని అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర పన్నిన షఫీ ఆర్మర్ ‘జునూద్’ మాడ్యుల్‌కు కొనసాగింపుగా హైదరాబాద్‌లో మరో మాడ్యుల్ తయారు చేశాడు.

 

 దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టనప్పటికీ ఏయూటీ అధీనంలోనే కొనసాగుతోంది. ఉగ్రవాదంవైపు యువకులను ఆకర్షించేందుకు ఎలాంటి నేర చరిత్ర లేని, గతంలో చిక్కిన/పోలీసు నిఘాలో ఉన్న వారితో ఏమాత్రం సంబంధం లేని పాతబస్తీకి చెందిన 11 మందిని ఎంపిక చేసుకున్నాడు. వారితో వివిధ రకాల యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ విధ్వంసాలకు నిధుల్ని హవాలా ద్వారా పంపించాడు. ఈ ఉగ్రవాద అనుమానితులు ఇరాక్ కేంద్రంగా పని చేస్తున్న యూసుఫ్‌తోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వారి ఆదేశాల మేరకు విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయన్నారు. గచ్చిబౌలిలోని కొన్ని మాల్స్, కార్యాలయాలతోపాటు పబ్లిక్ ప్లేసుల్లోనూ అనుమానిత ఉగ్రవాదులు రెక్కీలు చేశారని, ఆన్‌లైన్‌లో మ్యాప్‌లు మార్చుకోవడంతోపాటు వారంలో ఒకరోజు హబీబ్ మహ్మద్ ఇంట్లో సమావేశమై చర్చించేవారని పేర్కొన్నారు.

 

 దవా... ఇంజెక్షన్.. టాబ్లెట్స్...

 ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పాటవుతున్న మాడ్యూల్స్ కీలక సమాచార మార్పిడి కోసం వైద్య పరిభాషను వినియోగిస్తున్నాయి. సంప్రదింపులు జరిపేది ఆన్‌లైన్‌లో అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా ఈ విధానాన్ని అవలంభిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో చిక్కిన జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ మాడ్యుల్ తాజాగా పట్టుబడిన ఏయూటీ ఉగ్రవాదులు ‘వైద్య పరిభాష’లోనే కోడ్ వర్డ్స్ ఏర్పాటు చేసుకున్నారని ఎన్‌ఐఏ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన 16 మంది ‘జునూద్’ ఉగ్రవాదులు ‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ అనే కోడ్ వర్డ్‌తో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడవగా తాజాగా చిక్కిన 11 మంది సైతం కీలక సమాచారాన్ని వైద్య పరిభాషలోనే మార్పిడి చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. పేలుడు పదార్థాలను దవా (మందులు) అని, నాటు తుపాకులను ఇంజెక్షన్స్, తూటాలను (పిల్లెట్స్) టాబ్లెట్స్ అంటూ సంభాషించుకున్నట్లు పేర్కొన్నారు.

 

 జనావాసాలకు దూరంగా ఫైరింగ్ ప్రాక్టీస్

 ఏయూటీ మాడ్యూల్ ఎవరికీ అనుమానం రాని పదార్థాలనే ఎక్స్‌ప్లోజివ్స్‌గా వాడాలని పథకం వేసింది. సాధారణ పెయింట్స్, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాస్ఫరస్ తదితరాలను వినియోగించి ఐఈడీ బాంబులు తయారు చేయాలని కుట్ర పన్నింది. ఇందుకోసం బార్కస్‌లోని హబీబ్ మహ్మద్ నివాసం వెనుక ప్రాంతంలో కొన్ని ప్రయోగాలు పూర్తి చేసింది. అదే ప్రాంతంలో ఎయిర్ గన్ వినియోగించి టార్గెట్ బోర్డులపై ఫైరింగ్ ప్రాక్టీస్ సైతం జరిపింది. అతడి నివాసం జనావాసాలకు దూరంగా ఉండటంతో ఇది సాధ్యమైంది.

 

 వ్యవస్థీకృత మాడ్యుల్

 ఏయూటీ మాడ్యూల్ పక్కా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులంతా వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ), వాట్సప్, ఫేస్‌బుక్, హైక్ వంటి ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ నిఘాకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మాడ్యుల్ మొత్తం ఆరు విభాగాలుగా పని చేస్తోంది. తమ భావజాలం ప్రచారం, ఆసక్తి ఉన్న వారి ఎంపిక, ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ, దాడులు చేసే ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రి సరఫరా, విధ్వంసం సృష్టించాల్సిన ప్రాంతాల్లో రెక్కీల వంటి వాటిని బృందాలవారీగా చేపడుతూ వ్యూహాత్మక దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.


బ్రస్సెల్స్ తరహాలో దాడులు

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మార్చి 22న జరిగిన తరహాలో దాడులు చేయాలని ఏయూటీ పథక రచన చేసినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. అక్కడ ఐసిస్.. పేలుడు పదార్థంగా టీఏటీపీని (ట్రైఎసిటోన్ ట్రై పెరాక్సైడ్) వినియోగించింది. ఎసిటోన్ రసాయనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాల మిశ్రమంతో దీన్ని తయారు చేసి బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో, మెట్రో స్టేషన్‌లో బాంబులను పేల్చారు. ఇవి బ్యాగేజీ స్కానర్‌లోనూ దొరకవు. బుధవారం చిక్కిన ఏయూటీ మాడ్యూల్ వద్ద కూడా ఎన్‌ఐఏ అధికారులు... రసాయనాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా స్వాధీనం చేసుకున్నారు. వీరి టార్గెట్‌లో ఉన్న ఐటీ కారిడార్‌లోని అనేక ప్రాంతాల్లో బ్యాగేజీ స్కానర్లు ఉండడం గమనార్హం.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top