పెన్షన్ కోసం తప్పని టెన్షన్


బీఆర్వోలు వచ్చినా నిధులు విడుదల చేయని ఆర్థిక శాఖ

 

 సాక్షి, హైదరాబాద్: పెన్షన్ లబ్ధిదారులకు టెన్షన్ తప్పడం లేదు. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యాన్ని నివారించే నిమిత్తం గత నెల 16న ఏడాది మొత్తానికి ఒకేసారి రూ.4,700 కోట్లకు ప్రభుత్వం  బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయినా మే నెలలో పంపిణీ చేయాల్సిన ఏప్రిల్ పింఛన్లకు ఆర్థిక శాఖ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో దాదాపు 35.89 లక్షలమంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అనాథాశ్రమాల్లోని శారీరక, మానసిక వికలాంగులకు ఆసరా పథకం వర్తించడంలేదు.



వైకల్య ధ్రువీకరణ, కుటుంబ వార్షికాదాయం, ఓటరు, ఆధార్ కార్డులు లేకపోవడమే వీరికి శాపమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఇలాంటివారు ఉండొచ్చని అధికారుల అంచనా. సంబంధిత ధ్రువీకరణపత్రాలను తహసీల్దారుతో ఇప్పించి అనాథ బాలల(వికలాంగుల)కు కూడా ఆసరా పింఛన్ అందించేందుకు ప్రయత్నిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వైకల్య నిర్ధారణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే సదరం(సాఫ్ట్‌వేర్ ఫర్ అసెస్‌మెంట్ ఆఫ్ డిసెబిలిటీ యాక్సెస్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్) ధ్రువీకరణ పత్రాలను ఇకపై మీ సేవా కేంద్రాల్లోనూ పొందే వెసులుబాటు కల్పించాలని సర్కారు యోచిస్తోంది. సదరం క్యాంపులు ద్వారా నమోదైన వికలాంగుల ధ్రువీకరణ పత్రాలను మీ సేవలో అప్‌లోడ్ చేయాలని అన్ని జిల్లాల డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్లను ఆదేశించినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top