మా'విడాకులు'!

మా'విడాకులు'! - Sakshi

ఎన్నారై సంబంధాల ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే

- వివిధ కారణాలతో విడిపోతున్న జంటలు

ఎన్నారై విడాకుల కేసుల్లో తెలంగాణ రెండో స్థానం

స్వదేశంలో వివాహం చేసుకొని విదేశాల్లో విడాకులిస్తున్న భర్తలు

దిక్కుతోచని స్థితిలో తిరిగి వచ్చేస్తున్న యువతులు

హిందూ వివాహ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోని విదేశీ న్యాయస్థానాలు

స్వల్ప కారణాలకే విడాకులు మంజూరు... పిల్లల అప్పగింతలోనూ భర్తలకే ప్రాధాన్యం

హిందూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకునేలా చేయాలని కోరుతున్న మహిళా కమిషన్‌.. 

 

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా మంకమ్మతోటకు చెందిన శ్రావణి (పేరు మార్చాం) హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అమెరికా సంబంధం వెతికారు. బంధువుల ద్వారా గోదావరిఖనికి చెందిన కల్యాణ్‌ (పేరు మార్చాం)తో సంబంధం కుదిరింది. అమెరికాలో హెచ్‌1బీ వీసాతో కల్యాణ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శ్రావణి తల్లిదండ్రులు కట్నాలు, కానుకలతో సహా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. నెల రోజులకు కల్యాణ్, శ్రావణి దంపతులు అమెరికా వెళ్లిపోయారు. కానీ శ్రావణి తల్లిదండ్రుల ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైపోయింది.



అమెరికాలో తన భర్త వేధింపులు, ఆడబిడ్డ ఛీత్కారాలను శ్రావణి ఫోన్‌ చేసి చెప్పింది. ఇదేమిటని ప్రశ్నిస్తే కల్యాణ్‌ విపరీతంగా కొట్టి మెట్ల మీది నుంచి తోసేశాడని చెప్పింది. అయితే కొంతకాలం భరించాలని, పరిస్థితిలో మార్పు వస్తుందంటూ తల్లిదండ్రులు సముదాయించారు. కానీ పరిస్థితి మారలేదు. మొదటి పెళ్లి రోజు విందు సమయంలోనూ శ్రావణిని ‘వంట చేయరాదు, ఆడబిడ్డను గౌరవించడం తెలియదు, భర్తతో ఎలా ఉండాలో తెలియదు..’అంటూ సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో ఆవేదనకు గురైన శ్రావణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా భర్త పట్టించుకోలేదు. ఆడబిడ్డ భర్త శ్రావణిని ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు కల్యాణ్‌ మాత్రం శ్రావణిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రిలో అపస్మారక స్థితి నుంచి బయటపడిన శ్రావణి ఇది తెలిసి హతాశురాలైంది. అమెరికాలోని ఓ స్నేహితురాలి సహాయంతో స్వదేశానికి తిరిగొచ్చింది.



అప్పటి నుంచి కల్యాణ్‌ కుటుంబం ఫోన్లన్నీ స్విచ్చాఫ్‌. పదిహేను రోజుల తర్వాత కల్యాణ్, శ్రావణిలకు అమెరికా కోర్టు ఇచ్చిన విడాకుల పత్రాలు కరీంనగర్‌లోని శ్రావణి తల్లిదండ్రుల ఇంటికి చేరాయి. ఇక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. ఆవేదనలో మునిగిపోయింది.. ఇది ఒక్క శ్రావణి కథ కాదు.. రాష్ట్రంలో ఎన్నారై యువకులను పెళ్లి చేసుకొని మూడ్నాళ్లు కాకుండానే విడిపోతున్న వందలాది మంది యువతుల దీన గాథ. ఎన్నారై పెళ్లిళ్లపై కేసుల సంఖ్య గత నాలుగేళ్లుగా ఏటికేడు పెరిగిపోతోంది. ఈ సంఖ్యలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పష్టం చేసింది.

 

ఇరు వైపులా కారణాలు

భార్యాభర్తల మధ్య కలహాలు, అపోహలు కొంతవరకు సాధారణమే. కానీ ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో మాత్రం విభిన్న కారణాలు కనిపిస్తు న్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో విలాసవంతమైన జీవితం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి.. భార్యాభర్తల దూరం పెరగడం, కొందరు భార్యలు భర్తలను పట్టించుకోకపోవడం, కొందరు భర్తలు భార్యలను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటి కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నారై యువకులకు పెళ్లికి ముందే వివాహేతర సంబంధాలు ఉండి.. పెళ్లయ్యాక భార్యకు ఆ విషయం తెలియడంతో కలహాలు మొదలై పరిస్థితి విడిపోయేదాకా వస్తోందని అంటున్నారు. వీటితోపాటు అహంతో వచ్చే సమస్యలు, లేట్‌నైట్‌ పార్టీలు, ఎవరికి నచ్చినట్టు వారు ఉంటుండటం, కాపురాలు చేయకపోవడం, పిల్లల్ని కనే విషయంలో అభిప్రాయ భేదాలు, ఒకరి కుటుంబం గురించి మరొకరు ఆరోపణలు– ప్రత్యారోపణలు చేసుకోవడం.. ఇలాంటి కారణాలతో ఎక్కువగా విడిపోతున్నారని సీఐడీ వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులు తెలిపారు.

 

ఏటా పెరుగుతున్న కేసులు

ఎన్నారై భర్తలు చేస్తున్న మోసాల కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. 2014లో 59 కేసులు నమోదుకాగా, 2015లో 69 కేసులు, 2016లో 92 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మే చివరి వరకు 53 కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎన్నారైలపై 498ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసినా.. వారిని ఇండియాకు రప్పించి, అరెస్టు చేసే అవకాశం ఇక్కడి పోలీసులకు లేకుండా పోయింది. వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన తర్వాత.. ఏదైనా సందర్భంలో స్వదేశానికి వస్తే గానీ అదుపులోకి తీసుకోవడం జరగడం లేదు. కేసుల విషయం తెలిసిన ఎన్నారైలు రాష్ట్రానికి రావడం లేదని పోలీసులు చెప్తున్నారు.

 

పెళ్లి హిందూ చట్టం.. విడాకులు విదేశీ చట్టం..

హిందూ సంప్రదాయం, ఇక్కడి చట్టం ప్రకారం వివాహం చేసుకుంటున్న ఎన్నారై యువకులు.. విడాకులను మాత్రం విదేశీ చట్టం ప్రకారం ఇచ్చేస్తున్నారు. డబ్బు, స్థానిక పరిచయాలను ఉపయోగించుకుని అక్కడి కోర్టుల్లో కేసులు వేయడం.. తన భార్యతో అభిప్రాయ భేదాలు, అనుకూలత లేదంటూ విడాకులు పొందడం.. వాటిని భారత్‌లోని భార్య చిరునామాకు పోస్టు చేయడం జరుగుతోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం తెలిపారు. అలాంటి కేసుల్లో విదేశాల్లో ఉంటూ న్యాయ పోరాటం చేయడం యువతులకు ఎలా సాధ్యమని పేర్కొన్నారు. విదేశాల్లో ఎన్నారైలు వేసే విడాకుల పిటిషన్లకు సంబంధించి హిందూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకునేలా విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు.

 

పిల్లల కోసం మరింత ఆవేదన

వివాహమై పిల్లలు పుట్టాక విడాకులిస్తున్న కేసుల్లో మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. డిపెండెంట్‌ వీసాపై విదేశాల్లో ఉంటున్న తమ భార్యను భర్త ఏదో ఓ కారణంతో స్వదేశానికి తిరిగి పంపి.. పిల్లలను మాత్రం తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో పిల్లలను తీసుకువచ్చేందుకు అక్కడి కోర్టుల్లో ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని సీఐడీని ఆశ్రయించిన మల్లిక (పేరు మార్చాం) తెలిపారు. హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లాలంటూ తన భర్త తనను పంపించాడని.. తీరా ఇక్కడికి వచ్చిన రెండు రోజులకే విడాకులు తీసుకుంటున్నట్టు తెలిసిందని వెల్లడించారు. పిల్లలను తన వద్దకు రప్పించుకోవడానికి అమెరికాలోని కోర్టుకు వెళ్లి చాలా ప్రయత్నించానని చెప్పారు. కానీ పిల్లలను తనకు ఇచ్చేందుకు అక్కడి కోర్టు నిరాకరించిందని తెలిపారు. ఎవరు ఎక్కువ ఆదాయం సంపాదిస్తే వారి వద్దే పిల్లలుండాలన్న విదేశీ చట్టంతోపాటు పిల్లలు అమెరికాలోనే పుట్టినందున అక్కడి స్థానికులవుతారని.. దాంతో ఇండియాకు తీసుకెళ్లడం కుదరదని కోర్టు పేర్కొందని తెలిపారు.

 

అన్నీ ఆలోచించి వివాహం చేయాలి

‘‘అబ్బాయికి అమెరికా ఉద్యోగం, జీతం మాత్రమే ఆలోచించకూడదు. అతడి వ్యక్తిత్వం ఎలాంటిది? కుటుంబ సభ్యుల మనస్తత్వాలు ఏమిటన్న విషయాలను ఆరా తీయాలి. అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం జరిపించాలి. ఎన్నారైలు విదేశీ చట్టాల ప్రకారం త్వరగా విడాకులు పొంది, ఇండియాలోని అమ్మాయికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళా కమిషన్, పోలీసు దర్యాప్తు బృందాలు విదేశాంగ శాఖపై ఒత్తిడి తెస్తున్నాయి. వివిధ దేశాలతో హిందూ చట్టంపై ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అది అమల్లోకి వస్తే ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్‌ పెట్టవచ్చు..’’

– సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top