కలసికట్టుగా పనిచేయండి

కలసికట్టుగా పనిచేయండి - Sakshi


* జీహెచ్‌ఎంసీ ఎన్నికలతర్వాత తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలి

* పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి పిలుపు


సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తలెత్తుకొని తిరిగే పరిస్థితి కల్పించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నగర అనుబంధ విభాగాలు, పార్టీ నగర, రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం జరిగింది.



పార్టీ నగర అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీలో, పదవుల్లో ఉన్న వారందరూ తాము ఏ మేరకు పనిచేస్తున్నామనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ పదవితో సరిపెట్టుకుంటారా లేక ప్రజల్లో కసిగా పనిచేసి ప్రజాప్రతినిధి కావాలనుకుంటున్నారా అని ప్రశ్నిం చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖమ్మం జిల్లాలో తనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాననే నమ్మకం తనకుందని పొంగులేటి చెప్పారు.



ఖమ్మంలో గల్లీగల్లీ తిరుగుతున్నానని, ఒక్కడిని ఎంతని పనిచేయగలనని, బాగా పనిచేసేవారు పది మంది తన వెంట ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పుతానన్న నమ్మకం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు హడావుడి చేస్తే లాభం ఉండదని, పార్టీ నిర్ణయాలు అమలు చేయనపుడు పార్టీ ఎలా పెరుగుతుందన్నారు. పదవులు కావాలంటే ఇచ్చామని, పార్టీకీ, మీకు మైలేజ్ వచ్చేలా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ఒక ప్రణాళిక రూపొందించుకుని అందరూ కలసికట్టుగా ముందుకు నడవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో అనుబంధ విభాగాల కమిటీ వేసి పనిచేస్తే, రాబోయే నాలుగేళ్లలో మహాశక్తిగా ఎదుగుతామన్నారు.



పార్టీ నగర అధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందరం కష్టపడి పనిచేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, పార్టీ అనుబంధ విభాగాలైన డాక్టర్స్, సేవాదళ్, ఐటీ, యువజన విభాగాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.ప్రఫుల్లా రెడ్డి, వెల్లాల రాంమోహన్, సందీప్ కుమార్, భీష్వ రవీందర్, మహిళా నేతలు క్రిష్టోలైట్, శ్యామల, పార్టీ రాష్ట్ర నాయకులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, జితేందర్ తివారీ, బి. మోహన్ కుమార్, మైనార్టీ నేత హర్షద్, నగర యువజన, విద్యార్థి విభాగాల నేతలు అవినాష్‌గౌడ్, సాయికిరణ్‌గౌడ్, నాగదేసి రవికుమార్, నీలం రాజు, శ్రీకాంత్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top