‘ఫీజు’ గోడు పట్టదా?

‘ఫీజు’ గోడు పట్టదా? - Sakshi


ఏపీ ట్రిపుల్ ఐటీల్లో తెలంగాణ విద్యార్థుల పాట్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయని ప్రభుత్వం

కోర్సు ముగిసినా సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు


 సాక్షి, హైదరాబాద్: వారంతా సరస్వతీ పుత్రులు.. కష్టపడి చదివి ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు సాధించారు.. మంచి మార్కులతో కోర్సులూ పూర్తి చేశారు.. కానీ ‘ఫీజు’ సమస్య వారి బంగారు భవిష్యత్తును చీకట్ల పాలు చేస్తోంది.. మంచి అవకాశాలు తలుపుతడుతున్నా అందుకోలేని దుస్థితిలో ముంచేస్తోంది.. ఒకరికి ఐఐటీలో సీటు వస్తే, మరొకరికి బహుళజాతి సంస్థలో ఉద్యోగం దక్కింది.. కానీ పైచదువు చదవలేరు, ఉద్యోగంలో చేరలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే దీనికి కారణం. ఫీజులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో పైచదువులు చదవలేని, ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితిలో విద్యార్థులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.


మూడేళ్లుగా..

గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మూడు ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసింది. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) పేరిట తెలంగాణలో బాసర, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయల్లో వాటిని నెలకొల్పింది. గ్రామీణ పేద విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సు బోధిస్తారు. విద్యార్థులకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2013  వరకు ప్రాంతాలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ అభీష్టం మేరకు తమకు సమీపంలోని ట్రిపుల్‌ఐటీలో చేరారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్ర విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీకి పరిమితమయ్యారు.


అయితే అప్పటికే నూజివీడు, ఇడుపులపాయల్లోని ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందుకు సంబంధించి నిధులు మాత్రం విడుదల చేయలేదు. గత రెండేళ్లుగా వాటిలోని రాష్ట్ర విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అందకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని స్పష్టం చేశాయి. అసలే గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక, ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేయక ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.


ఆరు వందల మందికి పైగా..

రాష్ట్ర విభజనకు ముందు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ఐటీ దూరం కావడంతో... నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలను ఎంపిక చేసుకునేవారు. ఇలా నాలుగేళ్ల పాటు ఏటా సగటున 150 మందికిపైగా ఈ రెండింటిలో ప్రవేశం పొందారు. ఇప్పుడా విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. ఇలా తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు బ్యాచ్‌లకు చెందిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశారు.


వారిలో కొందరు చివరి సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అటు ఉద్యోగాలకు ఎంపికైనా సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో కంపెనీలు విధులకు హాజరుకానివ్వడంలేదు. ఫలితంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం మరో మూడు వందల మంది విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఫీజు అంశంపై వారు కూడా ఆందోళన చెందుతున్నారు.


ఫీజు కట్టలేని పరిస్థితి

ట్రిపుల్‌ఐటీల్లో చేరిన విద్యార్థి ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు చదవాల్సి ఉంటుంది. దీనికి ఏటా రూ.35 వేలు ఫీజు. అంటే ఆరేళ్లకు కలిపి రూ.2.1 లక్షలు. అయితే ట్రిపుల్‌ఐటీల్లో చేరే విద్యార్థుల్లో చాలా వరకు పేదలే ఉంటుండడంతో ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి బాగానే ఉన్నా... తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య వచ్చింది. చెల్లింపులపై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒక్కో విద్యార్థి సగటున రూ.లక్ష వరకు కళాశాలకు బకాయిపడ్డారు. దీంతో కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కావడంతో ఫీజు కట్టలేని పరిస్థితి.


అవకాశాలున్నా అందుకోలేని దుస్థితి

అవకాశాలు తలుపు తడుతున్నా అందిపుచ్చుకోలేని పరిస్థితి ఖమ్మం జిల్లా సిరిపురానికి చెందిన తాళ్లూరి గోపిది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి రోజు కూలీ. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గోపి సీటు సాధించాడు. 2016లో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల గేట్ పరీక్ష రాసి 674 ర్యాంకు సాధించాడు. ఓవైపు ఐఐటీ తిరుచ్చిలో ఎంటెక్ సీటు, మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో ఓ సీనియర్ ప్రొఫెసర్ వద్ద ప్రాజెక్టు అసోసియేట్‌గా ఉద్యోగం వచ్చాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల పైచదువులు చదవలేక ఉద్యోగంలో చేరాడు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఉద్యోగంలో చేరిన చోట మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే నెలవారీ వేతనం ఇస్తామని షరతు పెట్టారు. దీంతో మూడు నెలలుగా ఉద్యోగం చేస్తున్నా వేతనం అందుకోలేని పరిస్థితి నెలకొంది.


అప్పు చేసి కట్టినా..

ఖమ్మం జిల్లా మధిరకు చిద్రాల సృజన చదువులో మేటి. తల్లి గృహిణి, తండ్రి టైలర్. పేద కుటుంబమైనా బాగా చదివి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. 2014లోనే కోర్సు పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగమని సాఫ్ట్‌వేర్ కంపెనీ షరతు పెట్టింది. మరోవైపు చివరి రెండేళ్లకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో ట్రిపుల్‌ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.60 వేలు అప్పుచేసిన సృజన.. ఆ డబ్బును ట్రిపుల్‌ఐటీలో కట్టి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, ఉద్యోగమిచ్చిన సంస్థకు సమర్పించింది. పేద కుటుంబం కావడంతో ఆ అప్పు ఇంకా తీర్చలేక, ఇప్పటికీ వడ్డీ కడుతున్నట్లు సృజన వాపోయింది.



నెల రోజులకే ఆనందం ఆవిరి

ఖమ్మం జిల్లాలోని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి సైదులు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. 2016లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్‌లో వుడ్‌ప్లే అనే ఫర్నీచర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఇక ముందు బంగారు భవిష్యత్తేనని ఆనందపడ్డాడు. కానీ నెలరోజులకే పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో... ట్రిపుల్ ఐటీలో రూ.1.22 లక్షల ‘ఫీజు’ బకాయిలు పేరుకుపోయాయి. దాంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.  సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగంలో కొనసాగాల్సి ఉంటుందని కంపెనీ తేల్చి చెప్పడంతో.. ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాడు.


ఉద్యోగం వచ్చినా..

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన టి.గోపి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. 2016 నాటికి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్‌లో ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరాన్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందేనని ఆ సంస్థ స్పష్టం చేసింది. అటు ‘ఫీజు’ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు రాలేదు. దీనిపై నూజివీడు ట్రిపుల్ ఐటీతో పాటు గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయంలోనూ సంప్రదించాడు. అధికారులెవరిని కలసినా ఫలితం రాలేదు. చివరికి టి.గోపి రెండో నెలలోనే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top