మండలం టు జిల్లా.. నాలుగు లేన్లు!

మండలం టు జిల్లా.. నాలుగు లేన్లు! - Sakshi


* మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు విశాలమైన రహదారులు

* ప్రత్యేక పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

* రూ. 2 వేల కోట్లతో 152 మండల కేంద్రాల నుంచి నిర్మాణం

* నాలుగేళ్లలో పనుల పూర్తి.. ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశం


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారుల వ్యవస్థకు త్వరలో మహర్దశ పట్టనుంది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేలా తెలంగాణలోని ప్రతి మండల కేంద్రం నుంచి ఆ జిల్లా కేంద్రానికి విధిగా నాలుగు లేన్ల రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. అడపాదడపా పనులు చేసి చేతులు దులుపుకోకుండా దీన్ని ఓ పథకంగా మార్చి నిర్ధారిత కాలపరిమితితో పనులు పూర్తి చేయాలనుకుంటోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రోడ్లు భవనాల శాఖ అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు అందజేయాలని కూడా ఆయన ఆదేశించారు.

 

నాలుగేళ్లలో.. దశలవారీగా..

దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రహదారుల విషయంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. తమిళనాడు, కర్ణాటకల్లో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లేన్ల రోడ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్టణాల మధ్య పరస్పర అనుసంధాన రహదారులు మెరుగ్గా ఉన్నాయి. అదే తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లా మినహా మరే జిల్లాలోనూ నాలుగు లేన్ల రోడ్ల వ్యవస్థ సరిగా లేదు.



ఈ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా రహదారులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచే సందర్భాల్లో.. కొన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి నాలుగు లేన్ల రహదారులు ఏర్పడ్డాయి. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులపై కాకుండా విడిగా ఉన్న మండల కేంద్రాల రోడ్లు మాత్రం అధ్వానంగానే ఉండిపోయాయి.

 

కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ కనీసం డబుల్ లేన్ రోడ్లు కూడా లేవు. సింగిల్ లేన్ రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కూడా. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను సంబంధిత జిల్లా కేంద్రంతో నాలుగు లేన్ల రహదారుల ద్వారా అనుసంధానించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో 152 మండల కేంద్రాలకు వాటి జిల్లా కేంద్రానికి మధ్య నాలుగు లేన్ల రోడ్లు లేవని గుర్తించారు.

 

వీటన్నింటినీ దశలవారీగా విస్తరించి నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. నాలుగేళ్ల కాలంలో ఈ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అయి ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top