కుటుంబానికి లక్ష మాఫీ!


రుణ మాఫీపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు

ఒక కుటుంబంలో రెండుమూడు అకౌంట్లు ఉన్నా.. లక్షలోపు రుణం మాఫీ

రూ. లక్ష దాటితే.. పై మొత్తాన్ని రైతులే భరించాలి

రుణాల చెల్లింపుపై స్పష్టత కోరిన బ్యాంకర్లు


 

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలు ఎన్ని ఉన్నా ఒక రైతు కుటుంబానికి లక్ష రూపాయలు మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రైతుపేరిట నాలుగైదు బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే.. ఆ అకౌంట్లలోని పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు, దీర్ఘకాలికం సహా అన్నీ కలిపి లక్ష రూపాయల లోపు ఉన్న వాటినే.. మాఫీ చేయాలని, అంతకు మించి రుణాలు ఉంటే.. రైతులే భరించేలా రుణ మాఫీని అమలు చేయాలని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించింది. రుణమాఫీ విషయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గురువారం తొలిసారి సమావేశమైంది.

 

ఈ సమావేశానికి నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) ప్రతినిధులతో పాటు ఇతర బ్యాంకర్లు, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఆప్కాబ్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు హాజరయ్యారు. రుణ మాఫీకి సంబంధించి రెండు మూడు రోజుల్లోగా మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి వచ్చిన సమాచారం మేరకు మొత్తం బకాయిలు రూ.17,337 కోట్లుగా అంచనా వేశారు. గ్రామాల వారీగా రైతులు, వారికున్న అకౌంట్లు ఎన్ని.? ఒకే రైతు ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నాడు? ఒక రైతు తీసుకున్న రుణాలు ఎన్ని.. వంటి అంశాలతో  వివరాలను బ్యాంకర్లు సమర్పించాలని ఈ సందర్భంగా కమిటీ వారిని కోరింది. బ్యాంకర్లు, సహకార పరపతి సంఘాలు ఇచ్చే సమాచారం ఆధారంగా.. రైతుల డూప్లికేషన్  తొలగించి, అనర్హులకు ప్రయోజనం కలగకుండా పారదర్శకంగా, పకడ్బందీగా రుణ మాఫీని అమలు చేయాలని కమిటీలో అభిప్రాయం వ్యక్తమైంది.

 

ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే.. ఇద్దరికీ రుణ మాఫీని వర్తింప చేయాలా..? లేక ఒకరికేనా..? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు సూచించారు. ఒక రైతుకు రెండు అకౌంట్లలో కలిపి లక్షా ఇరవైవేల రుణం ఉంటే.. అందులో లక్ష మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుందని, మిగిలిన ఇరవై వేలు రైతు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో వివరించనున్నారు.



ఇదిలా ఉండగా ఆంధ్రాలో రైతులకు కొత్త రుణాలు ఇస్తున్నట్టుగానే ఇక్కడా ఇవ్వాలని సమావేశంలో అధికారులు బ్యాంకర్లను కోరగా.. అక్కడి ప్రభుత్వం తమకు స్పష్టత ఇచ్చినందుకే రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరగా తేలిస్తే  కొత్త రుణాలు ఇస్తామని వారు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని ఎలా సమకూరుస్తారో వివరించాలని బ్యాంకర్లు అధికారులను కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top