ఏపీ నుంచి టీ విద్యుత్ ఉద్యోగులు వెనక్కి!

ఏపీ నుంచి టీ విద్యుత్ ఉద్యోగులు వెనక్కి!


రిలీవ్ చేయకున్నా వెనక్కి తీసుకోవాలని నిర్ణయం

 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వశాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులంతా జూన్ 27 నాటికి ఏపీ కొత్త రాజధాని అమరావతికి రావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.


ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమను రిలీవ్ చేయాలంటూ నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అమరావతికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ విద్యుత్ సంస్థలు తమ ప్రాంత ఉద్యోగులను వెనక్కి తీసుకుంటే విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.


గతేడాది జూన్ 10న తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ప్రాంత ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులో వేర్వేరుగా విచారణ జరుగుతోంది.




త్వరలో ప్రభుత్వానికి చెబుతాం

 ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేసినా చేయకపోయినా వారిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. 280 మంది తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు ఏపీలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. త్వరలో ప్రభుత్వానికి తెలిపి చర్యలు తీసుకుంటాం.

 - డి. ప్రభాకర్‌రావు,

 తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top