ఉపాధి పనుల్లో తెలంగాణ సంబురాలు


జూన్ 2న పని ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు

ఒక్కో కూలీకి రూ.10 చొప్పున రూ.1.60 కోట్లు

విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ

 

సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు ఇది ‘తీపి’ కబురు. తెలంగాణ సంబురాల్లో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ  దినోత్సవాల్లో భాగంగా జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశంలోనే కూలీలకు మిఠాయిలు పంచాలని అధికారులకు సూచించింది.


మిఠాయి కొనుగోలు నిమిత్తం ఒక్కో కూలీకి రూ.10 చొప్పున కేటాయించింది. ప్రస్తుతం పనులకు వస్తున్న 16 లక్షల మంది కూలీల కోసం రూ.1.60 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. సంబరాల ఏర్పాట్ల కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) ఖాతాలకు నిధులను జమ చేసినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఎంపీడీవోలకు గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితారామచంద్రన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


సంబురాలకు మార్గదర్శకాలివీ...

 గ్రామం వారీగా ఉపాధి కూలీల జాబితాను రూపొందించాలి

 సంబరాల నిర్వహణ నిమిత్తం ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి

 గ్రామాల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులకు ప్రోగ్రాం అధికారులు మిఠాయిలను అందజేయాలి

 గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల సహకారంతో సంబరాల ఏర్పాట్లు చేసుకోవాలి

 నాణ్యమైన మిఠాయిని మండల కొనుగోలు కమిటీ ద్వారానే కొనుగోలు చేయాలి

 జూన్ 2న పని ప్రదేశంలోనే ఉపాధి కూలీలందరికీ మిఠాయిలు పంచిపెట్టాలి

 ఉపాధి హామీ ప్రయోజనాలపై కూలీలకు అవగాహన కల్పించాలి

 ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద చేసిన పని వివరాలను తెలియజేయాలి

 మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి జిల్లా స్థాయిలో డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ సమీక్షించాలి.

 ఆపై నివేదికను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు పంపాలి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top