ముస్లింలకు 12% రిజర్వేషన్లు

ముస్లింలకు 12% రిజర్వేషన్లు - Sakshi


వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం: సీఎం కేసీఆర్‌

తమిళనాడు తరహాలో అమలు చేస్తాం

కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం

కేంద్రం కాదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం

మతపరమైన రిజర్వేషన్లని మేం ఎక్కడా చెప్పలేదు

ఆ మతంలో వెనుకబడిన వారికే రిజర్వేషన్లు

మసీదుల్లో మౌజం, ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.1,000 నుంచి రూ.1,500కి పెంచుతాం

సామూహిక మత మార్పిడులు మంచిది కాదు.. కానీ మతం ఎందుకు మారుతున్నారో ఆలోచించాలని వ్యాఖ్య




సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పారు. తమిళనాడులో రిజర్వేషన్‌ అమలు చేస్తున్నపుడు తమకెందుకు ఇవ్వరని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని, దీన్నే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రిజర్వేషన్లను సాధిద్దామని అన్నారు. బుధవారం అసెంబ్లీలో ‘మైనారిటీ సంక్షేమం–ప్రభుత్వ కార్యక్రమాలు’అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు.



ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టంచేశారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక రాష్ట్రం రాదన్నారు. అవమానపరిచారు. అయినా సాధించుకున్నాం. ఇప్పుడు ఇదీ అంతే. జనాభాలో 14.5 శాతం ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం’’అని అన్నారు. ‘రెక్కలతో కాదు.. ధైర్యంతో ఎగిరిపోదాం.. ముస్లిం రిజర్వేషన్లు సాధిద్దాం..’అంటూ ఈ సందర్భంగా ఉర్దూ షాయిరీ చెప్పారు.



రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్‌ కమిటీ ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసి రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్‌కు అప్పగించాం. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ తిరిగి అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సూచించాం. మసీదుల్లో పని చేసే మౌజం, ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.1000 నుంచి రూ. 1500కు పెంచుతాం. ఏప్రిల్‌ నుంచే దీన్ని అమలు చేస్తాం’’అని చెప్పారు.



ముస్లింలకు రిజర్వేషన్లు అంటే మతపరమైనవని తాము ఎక్కడా చెప్పలేదని సీఎం స్పష్టంచేశారు. ఆ మతంలోని వెనుకబడిన ప్రజలకు మాత్రమే రిజర్వేషన్లు అని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉన్నంత మాత్రాన, అసెంబ్లీలో దీనిపై చర్చించకూడదని, బిల్లు ప్రవేశ పెట్టవద్దని ఎక్కడా లేదని అన్నారు. ‘‘సామూహిక మత మార్పిడులు మంచిది కాదు. అయితే ఎందుకు మతం మారుతున్నారది ఆలోచించాలి. మతపరంగా నా కంటే పెద్ద హిందువు ఎవరు? ఎవరికైనా పరమత సహనం అవసరం’’అని వ్యాఖ్యానించారు.



మైనారిటీలకు 200 గురుకులాలు

గతంలో ముస్లింల అభివృద్ధి జరగాల్సినంత జరగలేదన్న అంశాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,204 కోట్లలో రూ.511 కోట్లు ఖర్చయినట్లు చెప్పారు. ఈ సంవత్సరం రూ. 850 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ‘‘ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసినంత మొత్తం కూడా సమైక్య రాష్ట్రంలో కేటాయించలేదు. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి వైపు అడుగులు ప్రారంభించింది. విద్యాపరంగా అభివృద్ధి చేస్తే వారు మరింత ముందుకెళ్తారన్న ఉద్దేశంతో కేజీ టు పీజీలో భాగంగా 200 మైనారిటీ గురుకులాలను ప్రారంభిస్తున్నాం.



ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చు చేస్తాం. చింతల రాంచంద్రారెడ్డి మైనారిటీ గురుకులం కోసం రూ.1 కోటి ఇస్తాననడం అభినందనీయం. అన్ని నియోజకవర్గాలకు గురుకుల విద్యాలయాలను ఇస్తాం. ఆ వివరాలను ఎమ్మెల్యేలకు పంపిస్తాం. కేంద్రం కూడా 7 మైనారిటీ గురుకులాల కోసం రూ.75 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో రూ.55 కోట్లు వెచ్చిస్తోంది’’అని సీఎం వివరించారు. దళిత క్రిస్టియన్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళితులకు వర్తించే ప్రయోజనాలనే వారికి వర్తింపజేస్తామని స్పష్టంచేశారు.



ఉర్దూ అకాడమీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఉర్దూ ఆకాడమీలో పని చేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ‘‘ప్రభుత్వం ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపట్టింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఉన్న వారి సర్వీసునే రెగ్యులరైజ్‌ చేస్తాం. ఉర్దూ అకాడమీలో పని చేస్తున్న వారి విషయాన్ని కూడా పరిశీలిస్తాం. వీలైనంత మేరకు చేస్తాం. రెగ్యులరైజేషన్‌ విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అడ్డు వస్తే వారికి వేతనాలు పెంచుతాం. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నదే మా విధానం. అందుకే కానిస్టేబుల్‌తో సమానంగా పనిచేసే హోంగార్డులకు వేతనాలను పెంచాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తాం. దీనిపై మైనారిటీ సంక్షేమ శాఖ అన్ని శాఖలకు లేఖలు రాయాలి’’సూచించారు. ఉర్దూ టీచర్ల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్‌ చెప్పారు. నీట్‌ పరీక్షను ఉర్దూలోనూ నిర్వహించాలని ప్రధానికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తామన్నారు. ఫలక్‌నుమా డిగ్రీ కాలేజీ కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రానికి కల్లా జీవో జారీ చేస్తామని చెప్పారు.



స్థలాలను వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తాం

రాష్ట్రంలో వక్ఫ్‌కు చెందిన స్థలాలు ఖాళీగా ఉన్నా, కబ్జాలో ఉన్నా వాటన్నింటిని స్వా«ధీనం చేసుకొని వక్ఫ్‌ బోర్డుకే అప్పగిస్తామని సీఎం స్పష్టంచేశారు. దీనిపై ముస్లిం ఎమ్మెల్యేలతో హౌస్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘‘వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ పవర్‌ ఇస్తాం. ఇందుకు ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలనుకున్నాం. కానీ అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయం మేరకు ఆగాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతాం. కరీంనగర్‌లో 10 ఎకరాల వక్ఫ్‌ భూమిని స్వాధీనం చేసుకొని వక్ఫ్‌ బోర్డుకు అప్పగిస్తాం. కబ్జాదారులు ఎంత పెద్ద వారైనా, కలెక్టరైనా సస్పెండ్‌ చేస్తాం’’అని పేర్కొన్నారు.



ముస్లింలకు కన్వెన్షన్‌ సెంటర్‌

‘‘రాష్ట్రంలో కచ్చితంగా ఉర్దూ రెండో అధికార భాషగా అమలు చేస్తాం. ఉర్దూ అకాడమీకి శాశ్వత భవనం నిర్మిస్తాం. ముస్లింల కోసం హైటెక్‌ సిటీ పరిసరాల్లో ఇస్లామిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ ఖ్యాతి ఇనుమడించేలా దీన్ని ఏర్పాటు చేస్తాం. ఇదేగాకుండా మరో కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా నిర్మిస్తాం’’అని సీఎం చెప్పారు. ఉర్దూ మీడియం జూనియర్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను వచ్చే మార్చి నుంచే రెగ్యులర్‌ కోర్సులుగా మార్చుతామన్నారు. ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అనీస్‌–ఉల్‌–గుర్బా అనాథ శరణాలయానికి వెంటనే రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. షాదీ ముబాకర్‌ పథకం కింద మార్చి 31 నాటికి వంద శాతం చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు.



తొందరపాటుతో మొదటికే మోసం తేవొద్దు..

‘‘అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లింలకు న్యాయం కలగాలంటే 12 శాతం రిజర్వేషన్ల అమలు అవసరం. దాన్ని సాధించాలి. అంతేకాని మొదటికే మోసమొచ్చేలా హడావుడి పడటం సరికాదు. ప్రస్తుతం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇది కాకుండా అదనంగా మరో 8 శాతం రిజర్వేషన్లకు శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అంతేకాని మొత్తంగా 12 శాతం అమలు చేస్తామని తీర్మానం చేస్తే.. రేపు కోర్టు దాన్ని కొట్టేస్తే ప్రస్తుతం అమలవుతున్న 4 శాతం కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని వివరిస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రికి నేను లేఖ రాశాను. అయినా దాన్ని పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. ఇక.. ముస్లింల వెనకబాటును సుధీర్‌ కమిషన్‌ తేల్చింది. అది పూర్తి వాస్తవం. కానీ ఆ కమిషన్‌కు చట్టబద్ధత లేదు. దాని ఆధారంగా తీర్మానం చేసినా ఇబ్బందులు తప్పవు. ఈ విషయమై కూడా నేను ముఖ్యమంత్రికి లేఖ రాశాను.



బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో మైనారిటీ కమిషన్‌తో కలసి ముస్లింల పరిస్థితిపై సర్వే చేయాలి. దాని ఆధారంగా ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి, ఆ సిఫారసులను అనుసరించి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలి. చట్టబద్ధత ఉన్న సంస్థలు ఇచ్చే సిఫారసులకే విలువ ఉంటుందనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. తమిళనాడులో ఏం చేశారనే విషయాన్ని పక్కన పెట్టి, తెలంగాణలో ముస్లింకు న్యాయం జరిగే విధంగా 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రణాళిక ఎలా ఉండాలనే విషయంలో ప్రభుత్వం పునరాలోచించారు. తొందరపాటు చర్యలతో అసలుకే ఎసరు తేవద్దు. అదనంగా 8 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే పార్లమెంటులో చట్ట సవరణ కావాలి. ఆ 8 శాతం రిజర్వేషన్లను ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సరైన సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. దానికి సరైన ప్రణాళిక అవసరం. వచ్చే అభ్యంతరాలను అధిగమించేలా కసరత్తు ఉండాలి. కానీ అలా ఉన్నట్టు కనిపించటం లేదు’’ – ఆబిద్‌ రసూల్‌ ఖాన్, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

 

 

 

 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top