టీడీపీలో ‘రాజధాని’ కలకలం

టీడీపీలో ‘రాజధాని’ కలకలం - Sakshi


శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ప్రకంపనలు



* పలువురి నేతల సంతృప్తి.. మరికొందరికి మింగుడుపడని వైనం

* నివేదికలోని అంశాలపై మంత్రుల భిన్నాభిప్రాయాలు

* తలోరకంగా మాట్లాడొద్దంటూ మంత్రులకు బాబు హుకుం

* మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చిద్దామన్న సీఎం

* కమిటీ నివేదికపై స్పందన కోరిన మీడియాపై చంద్రబాబు అసహనం


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణాన్ని వికేంద్రీకరించటమే శరణ్యమని.. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన ప్రాథమిక నివేదికలో తేల్చిచెప్పటం రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నివేదికలోని అంశాలు కొందరికి సంతృప్తి కలిగించగా మరికొందరికి ఏమాత్రం రుచించలేదు. కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలోనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెరవెనుక రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్న పలువురు టీడీపీ నేతలకు కమిటీ సూచనలు మింగుడుపడలేదు.

 

దాంతో వారు హడావుడిగా ఢిల్లీ నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. కొత్త రాజధాని నిర్మాణంలో కేంద్ర సాయం ఎంతో అవసరమైన పరిస్థితుల్లో ఆ కమిటీ సిఫారసులు కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పలువురు నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఇదిలా ఉంటే.. నివేదికపై రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ లాబీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. అవన్నీ ఎప్పటికప్పుడు టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌ల రూపంలో రావడంతో అసెంబ్లీలో తన చాంబర్లో ఉన్న సీఎం చంద్రబాబు వారందరినీ హడావుడిగా పిలిచి సమావేశం నిర్వహించారు. రాజధానిపై ఇష్టానుసారం వారు మాట్లాడవద్దని హుకుం జారీచేశారు.

 

అంతా అనుకున్నట్లే జరుగుతుంది..!

రాజధానిపై అంతా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రులకు బాబు సూచించారు. ‘రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడితే కొత్త సమస్యలు వస్తాయి. అంతిమంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రులు సమన్వయం లేకుండా మాట్లాడితే చిక్కులు కొనితెచ్చుకుంటామని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. సెప్టెంబర్ ఒకటిన జరిగే మంత్రివర్గంలో దీనిపై సమగ్రంగా చర్చిద్దామని సూచించారు.

 

మీడియా ఇష్టానుసారం ప్రచారం చేస్తోంది: బాబు

శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులపై అభిప్రాయం తెలిపాలని కోరిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు అసహనం వ్యక్తపరిచారు. గురువారం అసెంబ్లీ వాయిదాపడ్డ తర్వాత మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. బాబు అసహనంగా స్పందిస్తూ.. ‘‘రాజధానిపై మీడియా ఎవరిష్టానుసారం వారు ప్రచారం చేస్తున్నారు. రాజధాని ఎక్కడనే అంశంపై ఏదీ తేలకుండానే ఏవేవో ప్రాంతాలను ప్రచారంలో పెడుతూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, దొనకొండ, వినుకొండ అంటూ ఎవరికి తోచినట్లు వారు చెప్పేస్తున్నారు.

 

ఇది సరికాదు. అలా వార్తలు ప్రచారం చేస్తూ దానిపై మళ్లీ నా అభిప్రాయం చెప్పమంటున్నారు. అసలు రాజధాని కమిటీ నివేదిక గురించి మాకెలాంటి సమాచారమూ లేదు. మాకు నివేదికా రాలేదు. అది వచ్చాక రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు మంత్రులు లాబీల్లో పలు అభిప్రాయాలు వెల్లడించారు. రాజధాని గుంటూరు - విజయవాడ మధ్యే ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

 

గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని వద్దని కమిటీ చెప్పలేదని, ఇంకా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. పంట భూములను రాజధాని కోసం తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి  లేదని స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక నిర్ణయం ప్రభుత్వానిదే.. కమిటీ సూచించిన మార్గాల్లో ఏది మంచో ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

 

రాజధాని అడవుల్లో ఉంటే ఏం బాగుంటుందని వ్యాఖ్యానించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అయినా ఎడారిలా ఉంటుంది. అదే న్యూయార్క్ నగరం రాజధాని కాకపోయినా నిత్యం హడావుడిగా ఉంటుందని యనమల చెప్పుకొచ్చారు.

 

అది గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదిక!: హోంశాఖ వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై కె.సి.శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందని, అందులోని అంశాలు ఇవీ అంటూ వస్తున్న వార్తలు సరికాదని, అది కేవలం గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికేనని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. శివరామకృష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే దీనిని శుక్రవారం లేదా సోమవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలనకు వెళుతుందని ఆ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి పరిశీలన తరువాతే ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుందని వివరించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top