కరువును పట్టించుకోని ప్రభుత్వం

కరువును పట్టించుకోని ప్రభుత్వం - Sakshi


గవర్నర్‌కు టీడీపీ వినతిపత్రం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, వరసగా రెండో ఏడాది కూడా కరువు తాండవిస్తుండటంతో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని తెలంగాణ టీడీపీ బృందం ఆవేదన వ్యక్తం చే సింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 440 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, భూగర్భ జల మట్టం పూర్తిగా పడిపోయిందని, చెరువులు, కుంటలు, బావులు, సాగు, తాగునీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయని వివరించారు.


సమస్య తీవ్రం గా ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఎలాంటి సమావేశాలు జరపలేదని, ప్రభుత్వం వద్ద కాంటింజెన్సీ ప్రణాళిక కూడా లేకుండాపోయిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి కనీసం 500మంది వడదెబ్బతో మరణించారని, పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. రైతులు పశువులను కబేళాలకు అమ్ముకుని ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. కరువు ఎదుర్కొనేందుకు కేంద్రం రూ.791కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, కానీ వాటిని ఖర్చు చేయలేదని, ఉపాధి కూలీల వేతనాలూ పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు.


ఈ గడ్డు పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయట పడేసేందుకు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు చెందిన అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని, పశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు  చేయాలని, ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, అర్హులైన వారికి కరువు పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలసిన వారిలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రె డ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top