టీడీపీని టీఆర్ఎస్లో కలిపేశాం

టీడీపీని టీఆర్ఎస్లో కలిపేశాం - Sakshi


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అంతా అనుకున్నట్టే చేశారు. టీడీపీ నాయకత్వానికి షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని టీడీపీ నాయకత్వం చెబుతుండగా, తమదే అసలైన పక్షమంటూ టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశామని చెబుతున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభా పక్షాన్నే విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. శాసనసభలో టీడీపీ పక్షం విలీనం చేసినట్టు తెలియజేస్తూ ఏకంగా స్పీకర్కు లేఖ అందించారు.



తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ మధుసూధనా చారికి అందజేసిన లేఖలో తెలియజేసారు. తెలంగాణలో టీడీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, శాసనసభా పక్షం తరఫున తామంతా శుక్రవారం ఒక సమావేశం నిర్వహించాం. లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఈ సమావేశం తీర్మానం చేశాం. ఈ సమావేశంలో 10 మంది ఎమ్మెల్యే పాల్గొన్నారు.



టీడీపీ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని తీర్మానం చేసిన నేపథ్యంలో రాజ్యాంగంలోని 10 వ షెడ్యూలు పేరా 4 మేరకు తమను టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా పరిగణించాలి... అని కోరుతూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారు శుక్రవారం స్పీకర్ కు అందజేశారు.స్పీకర్ కు అందజేసిన వినతి పత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తీగల కృష్ణారెడ్డి, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరపు కృష్ణారావు, కేపీ వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్లు సంతకాలు చేశారు.



మరోవైపు తెలంగాణ టీడీఎల్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు సండ్ర వీరయ్య, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీ తదితరులు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు ... అసెంబ్లీ కార్యదర్శికి ఓ లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు టీమ్ విలీనం చెల్లదన్నారు. విలీనం అంటే మొత్తం పార్టీ విలీనం కావాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.


Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top