నోటిఫికేషన్ల క్లియరెన్స్‌కు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

నోటిఫికేషన్ల క్లియరెన్స్‌కు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

సాక్షి, హైదరాబాద్‌: నోటిఫికేషన్ల క్లియరెన్స్‌కు నాలుగు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకుండా అడ్డంకిగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయించింది. వివిధ పోస్టులకు సంబంధించి శాఖల నుంచి రావాల్సిన వివరణలు, ఇండెంట్లు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌పై విఠల్, విద్యాసాగర్‌లతో కూడిన కమిటీ మంగళవారం సమావేశమైంది. ఆయా వివరణలు తెప్పించుకునేందుకు ఈ నెల 27 నుంచి 31 వరకు ఆయా శాఖాధిపతులతో సమావేశం కావాలని నిర్ణయించింది. పెండింగ్‌ పోస్టులపై వివరణలివ్వాలని ఆయా శాఖలకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే లేఖలు రాసింది. షెడ్యూలు ప్రకారం ఆయా విభాగాధిపతులు వివరణలతో హాజరు కావాలని కమిషన్‌ సూచించింది. 

 

► ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా పోస్టులు, అర్హతలు, ఇతర నిబంధనలు విద్యా శాఖ నుంచి రావాల్సి ఉందని కమిటీ తేల్చింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం లభించాల్సి ఉందని గుర్తించింది. అవి వచ్చే దాకా వేచి చూడాలని నిర్ణయించింది. 

► మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్, జీహెచ్‌ఎంసీ విభాగాల్లో హెల్త్‌ అసిస్టెంట్, శానిటరీ అసిస్టెంట్, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, డ్రాట్స్‌మెన్‌ సివిల్‌ వంటి పోస్టులకు మున్సిపల్‌ విభాగంలో సర్వీస్‌ రూల్స్‌ లేవు. ఇతర శాఖల సర్వీస్‌ రూల్స్‌ మున్సిపల్‌ శాఖలోని పోస్టులకు అడాప్ట్‌ చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసి తమకు పంపాలని సూచించింది. 

► వైద్యారోగ్య శాఖలో 1,500 వరకు పారామెడికల్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వామోదిత పోస్టులకు జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్లకు మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి అన్ని పోస్టులను గుర్తించి ఇండెంట్లు ఇవ్వాలని పేర్కొంది. 

► రెవెన్యూ శాఖలో క్లర్క్, టైపిస్ట్‌ వంటి 800 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీకి పంపారు. కొత్త జిల్లాల ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పోస్టులు మంజూరయ్యే వరకు ఈ పోస్టుల భర్తీ ఆపాలని టీఎస్‌పీఎస్సీ యోచిస్తోంది. కొత్త జిల్లాల్లో అవసరాల ప్రకారం కనీసం ఐదారు వేల పోస్టులొచ్చే అవకాశం ఉన్నందున అన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది. మొత్తానికి పోస్టుల భర్తీలో పెండింగ్‌ అనేది లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 

 

నాలుగు కమిటీలివే.. 

1. పెండింగ్‌ నోటిఫికేషన్ల క్లియరెన్స్, వివరాల సేకరణ 

సభ్యులు: విఠల్, విద్యాసాగర్‌ 

2. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం 

సభ్యులు: విఠల్, చంద్రావతి, రామ్మోహన్‌రెడ్డి 

3. అర్హత నిబంధనలు, కోర్టు కేసుల పర్యవేక్షణ కమిటీ 

సభ్యులు: రాజేందర్, విద్యాసాగర్, మన్మథరెడ్డి 

4. అకడమిక్‌ అఫైర్స్‌.. సిలబస్‌ పేపర్‌ సెట్టింగ్‌ 

సభ్యులు: ఘంటా చక్రపాణి, సాయిలు, ఖాద్రీ
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top