ఇకనైనా నేలకు దిగివచ్చి పాలించండి

ఇకనైనా నేలకు దిగివచ్చి పాలించండి - Sakshi


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

బాన్సువాడ: ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నరేళ్లలో ఆకాశంలో పాలన సాగించారని, మిగిలిన రెండున్నరేళ్లయినా భూమిపై పాలనను సాగించి... నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేయా లని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో సాగింది. బాన్సువాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘వ్యవసాయ మంత్రి పోచారం ఎన్నికల హామీల్లో భాగంగా బాన్సు వాడలో విమానాశ్రయాన్ని తెస్తానని చెప్పి, ఆ మేరకు కష్టపడి విమానాశ్రయాన్ని తీసుకువస్తే మంచిదే.. కానీ ఆ విమానంలో కూర్చోవడానికి సామాన్యుల వద్ద డబ్బులు ఉండాలి కదా. ప్రజలు అభివృద్ధి చెందనప్పుడు ఎన్ని భవనాలు, విమానా శ్రయాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించినా వృథానే’’ అన్నారు.



బంగారు తెలంగాణ కాదు, బతుకు తెలంగాణ వస్తేనే అందరికీ సామాజిక న్యాయం చేకూరుతుందన్నారు. కేసీఆర్ తన పాదయాత్రపై విమర్శించారన్నారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధమన్నారు. అబద్ధాలు చెప్పి ఎన్నిసార్లయినా ముక్కు నేలకు రాసుకోవడానికి కేసీఆర్‌కు ఆ దేవుడు పెద్ద ముక్కు ఇచ్చాడన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని క్యాష్‌లెస్‌గా మారుస్తానని చెబుతున్నారని, ఇది మైండ్‌లెస్ ఆలోచన అని విమర్శించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఐటీ, పరిశ్రమలు, కారిడార్ అంటూ కాలాన్ని వృథా చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించారు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ, డీఎస్సీ నియామకాలు చేయకుండా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పడం విడ్డూరమన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top