తెలంగాణలో మార్పు కనిపించడం లేదు

తెలంగాణలో మార్పు కనిపించడం లేదు


మహాజన పాదయాత్రలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య

కేసీఆర్ సర్కారు తుగ్లక్‌ను తలపిస్తోంది: తమ్మినేని వీరభద్రం


 హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుతో నీరు, నిధులు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ప్రజలకు రెండేళ్లరుునా మార్పు కనిపించడం లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. రాష్ట్ర జనాభాలో 92 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి జరగనప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో ఆయన బుధవారం పాల్గొన్నారు. నేదునూరు గ్రామంలో పాషానరహరి స్తూపాన్ని ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి పోరాటం చేసిన పాషానరహరి దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. ఆయన భూమి, భుక్తి కోసం మహత్తర పోరాటం చేసిన  నేత అని కొనియాడారు. కేసీఆర్ సర్కారు తుగ్లక్ పాలనను తలపిస్తోందని విమర్శించారు.


రైతులు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. నేదునూరులోని మోడల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, బి.వెంకట్, జిల్లా కార్యదర్శి భూపాల్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సోమయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కె.రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top