ప్రజానేతల మహాభి షేకం..

ప్రజానేతల  మహాభి షేకం.. - Sakshi


ప్రజాపోరులో తుది విజేతల ‘గ్రేటర్’ మహోత్సవం గురువారం ఉత్సాహంగా జరిగింది. అవకాశంలో ‘సగం’ అందిపుచ్చుకున్న మహిళా కార్పొరేటర్లతో సహా నూతనంగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తొలుత ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి బస్సుల్లో బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఉత్సవానికి ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. నిన్నటి దాకా బోసిపోయిన జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఒక్క సారిగా కార్పొరేటర్లు, పార్టీల నాయకులు, కార్యకర్తలతో కళకళ లాడింది. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలులో కార్పొరేటర్లంతా నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు.మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఒకరినొకరు అభినందనలు చెప్పుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో

 

సమస్యల ‘బండ’ను తొలగిస్తా..

జూబ్లీహిల్స్: నిన్నటిదాకా సాధారణ యువకుడిగా బోరబండ వాసులకు తెలిసిన వ్యక్తి బాబా ఫసియుద్దీన్ నేడు కార్పొరేటర్‌గా.. మహానగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ డివిజన్ నగరం నడిబొడ్డున ఉన్నా అన్నివిధాలా వెనుకబడిన ప్రాంతం. మురికివాడలు, ఇరుకు గల్లీలతో ‘సమస్యల బండగా’ పేరుమోసింది. ఇప్పుడు ఈ ప్రాంత బాగోగులు చురుకైన యువ నాయకుడి చేతుల్లో ఉందని ఇక్కడివారు భావిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాబాను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇంత హడావుడిలోను ఆయన గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన ప్రాధాన్యతలు, చేయాల్సిన కార్యక్రమాలు వివరించారు. ఆ వివరాలు బాబా మాటల్లోనే..



‘కలలో కూడా ఊహించని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ పదవి లభించడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు. డిప్యూటీ మేయర్ పదవి నా బాధ్యతను మరింత పెంచింది. ఇక నా డివిజన్‌లో చాలా సమస్యలు ఎదురు చూస్తున్నాయి. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బోరబండలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం, బస్‌స్టేషన్, జూనియర్ కాలేజీ, సిటీ బస్‌ల సంఖ్య పెంపు, బస్సులను ఎంఎంటీఎస్‌తో అనుసంధానం, అన్నానగర్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం ఇందులో ఉన్నాయి. పలు బస్తీల్లో కమ్యూనిటీహాళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, మురుగు, మంచినీటి సమస్యల పరిష్కారం నేను చేయాల్సిన ప్రధాన విధులు. బోరబండ నుంచి హైటెక్ సిటీ వైపు ప్రస్తుతమున్న రవాణా సౌకర్యాలు మరింత పెంచేందుకు కృషి చేస్తాను.

 

 కట్టుబొట్టులో సంప్రదాయం

సిటీబ్యూరో: కొత్త కార్పొరేటర్లు సంప్రదాయ దుస్తుల్లో నూతనుత్తేజంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తరలివచ్చారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో కొందరు, సొంత వాహనాల్లో మరి కొందరు రాగా...ఎంఐఎం కార్పొరేటర్లు కూడా దారుస్సలాం నుంచి జీహెచ్‌ఎంసీకి వచ్చారు. హస్తినాపురం కార్పొరేటర్ పద్మ నాయక్ సంప్రదాయక గిరిజన (లంబాడ) దుస్తుల్లో హాజరయ్యారు. ఎంఐఎం కార్పొరేటర్లు పురుషులు షేర్వాణీలోను, మహిళలు బురఖాలోను వచ్చారు. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులు, ముత్రులతో హాజరయ్యారు.

 

ఈ అనందం చెప్పలేనిది..

మొదటిసారి ఓటు హక్కు వచ్చింది. నా ఓటు నాకే వేసుకోవడం చెప్పలేనంత అనందం కలిగించింది. చిన్న వయసులో.. చదువుతున్నప్పుడేగా కార్పొరేటర్‌గా అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి. ఇప్పుడు కార్పొరేటర్‌గా ఎన్నికై జీహెచ్‌ఎంసీలో అడుగు పెట్టడం.. అనుభవజ్ఞులతో కలిసి కూర్చోవడం చెప్పలేనంత సంతోషంగా ఉంది.

     - ఫహెద్ బిన్ అబ్దుల్ సమద్, ఉప్పుగూడ ఎంఐఎం కార్పొరేటర్

 

చాలా సంతోషంగా ఉంది

తొలిసారిగా కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్ గాలీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన విజయం సాధించడం మరింత అనందం కలిగించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సమస్యలపై గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తాను.  - శాంతి, నాచారం కాంగ్రెస్ కార్పొరేటర్

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top